తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకోసం అభ్యర్థుల ఎంపిక, టికెట్ల పంపిణీ వ్యవహారం రాజకీయ  పార్టీలకు తలనొప్పిగా మారింది. ఒక్కోస్థానం నుండి ఒకరికంటే ఎక్కువమంది నాయకులు టికెట్లు ఆశిస్తుండటంతో ఎవరిని ఎంపిక చేయాలో అర్థం కావటంలేదు. ఈ డైలమా వల్లే కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక ఆలస్యమైంది. ఇక టీఆర్ఎస్ పార్టీ 107 మంది అభ్యర్థులను ప్రకటించినా మిగిలిన స్థానాల్లో మాత్రం ఇప్పటివరకు అభ్యర్థులను ఎంపిక చేయలేదు. దీంతో ఈ స్థానాలకోసం ఇన్నిరోజులు ఎదురుచూసిన అభ్యర్థులు సహనం కోల్పోతున్నారు. దీంతో కార్యకర్తలు, అనుచరులతో కలిసి నిరసన వ్యక్తం చేస్తూ తమ అసంతృప్తిని ప్రదర్శిస్తున్నారు. 

టీఆర్ఎస్ పార్టీ పెండింగ్ లో పెట్టిన స్థానాల్లో హైదరాబాద్ లోని ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ కూడా ఒకటి. ఇక్కడ టీఆర్‌ఎస్ పార్టీ తరపున ఇటీవలే పార్టీలో చేరిన దానం నాగేందర్, నియోజకవర్గం ఇంచార్జి మన్నె గోవర్దన్‌రెడ్డి లు టికెట్ ఆశిస్తున్నారు. దీంతో టికెట్ ఎవరికిచ్చినా మరొకరు అసంతృప్తిబాట పడతారని భావించిన అధిష్టానం వ్యూహాత్మకంగా దాన్ని పెండింగ్‌లో పెట్టింది. 

దీంతో ఇప్పటివరకు సహనం వహించిన మన్నె గోవర్దన్‌రెడ్డి ఆందోళనకు దిగారు. తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి తెలంగాణ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళన చేపడుతున్న వారిని పోలీసులు నిలువరించడానికి ప్రయత్నించడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. దీంతో గోవర్థన్ రెడ్డితో పాటు పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీంతో అతన్ని సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇక మన్నె గోవర్థన్ రెడ్డి అనుచరుడొకరు తన తలను తానే బద్దలుకొట్టుకుని తీవ్రంగా గాయపర్చుకున్నాడు. తమ నాయకుడికి ఖైరతాబాద్ టికెట్ కేటాయించకుంటే ప్రాణత్యాగానికైనా సిద్దమేనంటూ పేర్కొన్నాడు. తీవ్రంగా రక్తసరావం అవుతుండటంతో అతన్ని కూడా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  

వీడియో

"

మరిన్ని వార్తలు

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత...దానంకు వ్యతిరేకంగా నిరసన(వీడియో)