చర్లపల్లి ఓపెన్ జైలు నుంచి ఓ జీవిత ఖైదీ పరారయ్యాడు. అతని సత్ప్రవర్తన కారణంగా ఇటీవలే ఓపెన్ జైలుకు మార్చారు. అతనికి ఇంక 20 యేళ్ల జైలు శిక్ష బాకీ ఉంది.  

హైదరాబాద్ : హత్య కేసులో జీవిత ఖైదీగా ఉన్న ఓ ఖైదీ గురువారం చర్లపల్లి జైలు నుంచి పరారయ్యాడు. మాలోతు హుస్సేన్ (55) అనే ఈ ఖైదీ గురువారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఓపెన్ జైలు నుంచి తప్పించుకున్నట్లు కుషాయిగూడ పోలీసులు తెలిపారు. 2015లో ఖమ్మం జిల్లాలో ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో ఇతనికి జీవిత ఖైదీగా శిక్ష పడింది.

వంటగదిలో తనకు అప్పగించిన పని చేయడానికి హుస్సేన్ గురువారం తెల్లవారుజామున నిద్ర లేచినట్లు పోలీసులు తెలిపారు. "కుక్‌గా పనిచేస్తున్న అనేక మంది ఖైదీలలో హుస్సియన్ కూడా ఉన్నాడు" అని కుషాయిగూడ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. అతను ఓపెన్ జైలు ఖైదీ అని అన్నారు. హుస్సేన్ మంచి ప్రవర్తన కారణంగా 2021లో ఓపెన్ జైలుకు మార్చబడ్డాడు. ఓపెన్ జైలులో ఖైదీలకు రిస్ట్రిక్షన్స్ తక్కువ ఉంటాయి. వీరందరూ చుట్టూ ఫెన్సింగ్ ఉన్న భారీ ప్రాంగణంలో ఉంటారు. 

దిండు మీద దుప్పటికప్పి.. సినీపక్కీలో ఆస్పత్రినుంచి తప్పించుకున్న దొంగ...

దీనిచుట్టూ ఉండే కొన్ని గేట్లకు గార్డులు కూడా లేరు. దీన్ని గమనించిన హుస్సేన్.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అలా హుస్సేన్ జైలు నుంచి తప్పించుకున్నాడు. ఇతర ఖైదీలు తమ సహ ఖైదీ అదృశ్యమైనట్లు గుర్తించి జైలు సిబ్బందికి సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసి పారిపోయిన ఖైదీ కోసం గాలింపు చేపట్టారు. "మేము సిసిటివి ఫుటేజీని పరిశీలిస్తున్నాం. అతనిని ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అతని కుటుంబ సభ్యులను సంప్రదిస్తున్నాం" అని పోలీసు అధికారి తెలిపారు.

జైలు సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. హుస్సేన్‌ నేరాన్ని హైకోర్టు ధ్రువీకరించిందని, అతను ఇప్పటికి ఏడేళ్ల 10 నెలల జైలు శిక్షను పూర్తి చేసుకున్నాడని తెలిపారు. మరో 20 ఏళ్ల ఆరు నెలల జైలు శిక్ష పెండింగ్‌లో ఉంది. "హైకోర్టు ఆదేశాలతో హుస్సేన్ డిప్రెషన్‌లోకి జారుకున్నట్లు కనిపిస్తోంది" అని జైలు అధికారి ఒకరు తెలిపారు. జనవరి 2023లో దోషికి పెరోల్ మంజూరు అయ్యంది. ఆ తరువాత ఆ గడువు ముగియడంతో, ఫిబ్రవరి 2న తిరిగి జైలుకు రిపోర్ట్ చేశాడు.

ఇలాంటి ఘటనే గురువారం ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడులో వెలుగు చూసింది. పల్నాడు జిల్లా గురజాల సామాజిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం నాడు ఈ ఘటన జరిగింది. ఓ దొంగ సినీ పక్కిలో ఆసుపత్రి నుంచి పరారయ్యాడు. ఆస్పత్రి బెడ్ మీద దిండు, కర్రల సంచిపెట్టి.. వాటి మీద నుంచి దుప్పటి కప్పి.. తాను ఉన్నట్టుగా భ్రమింప చేసి పోలీసుల కన్నుగప్పి పరారయ్యాడు. కాళ్లకు ఆపరేషన్ అయిన అలేఖ ఎలా వెళ్లాడని విచారణ జరపగా.. హాస్పిటల్లో ఉన్న వీల్ చైర్ తో సహా అతను పరారైనట్లు పోలీసులు అంటున్నారు. రెండు కాళ్లకు ఆపరేషన్ అయిన నేపథ్యంలో అతని కాళ్లు నడవడానికి సహకరించవని వైద్యులు తెలిపారు. అయితే ఈ క్రమంలోనే హాస్పిటల్ లోనే ఒక వీల్ చైర్ కూడా కనిపించడం లేదని తెలిసింది. దీంతో ఉద్దగిరి అలేఖ ఆస్పత్రిలోని వీల్ చైర్ సహాయంతో పారిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు.