ఓ దొంగ సినీ పక్కీలో ఆస్పత్రి నుంచి మాయమైన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. రెండుకాళ్లకు ఆపరేషన్ అయినా.. వీల్ చైర్ సాయంతో పారిపోయినట్టుగా తెలుస్తోంది. 

పల్నాడు : పల్నాడు జిల్లా గురజాల సామాజిక ఆరోగ్య కేంద్రంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. బుధవారం నాడు జరిగిన ఈ ఘటన తెలిసిన వారందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. ఓ దొంగ సినీ పక్కిలో ఆసుపత్రి నుంచి పరారయ్యాడు. ఆస్పత్రి బెడ్ మీద దిండు, కర్రల సంచిపెట్టి.. వాటి మీద నుంచి దుప్పటి కప్పి.. తాను ఉన్నట్టుగా భ్రమింప చేసి పోలీసుల కన్నుగప్పి పరారయ్యాడు. అచ్చు సినిమాల్లో చూపించినట్లుగా చేయడంతో ఇప్పుడు అంతా ఇదే విషయాన్ని చర్చించుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 

పల్నాడు జిల్లా చర్లగుడిపాడు గ్రామానికి చెందిన ఉద్దగిరి అలేఖ అనే వ్యక్తి ఇంట్లో దొంగ నోట్లు తయారు చేస్తున్నాడని సమాచారం పోలీసులకు అందింది. దీంతో 2022 నవంబర్ 17వ తేదీన ఆ ఇంట్లో పోలీసులు సోదా చేస్తుండగా.. సదరు వ్యక్తి గోడ దూకి పారిపోయాడు. ఈ క్రమంలో అలేఖ రెండు కాళ్లు దెబ్బతిన్నాయి. పోలీసులు ఈ ఏడాది జనవరి మూడున ఈ వ్యవహారంలో అలేఖతో పాటు మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వీరిని కోర్టులో హాజరు పరిచారు. 

నల్లమలలో ఆపరేషన్ మదర్ టైగర్: ఆత్మకూరులోనే నాలుగు పులి పిల్లలు

దీనిమీద విచారించిన కోర్టు అలేఖకు రిమాండ్ విధించింది. అయితే అలేఖ పారిపోతుండగా కాలికి గాయాలు కావడంతో సబ్ జైలు అధికారులు అలేఖ రెండు కాళ్ళకు చికిత్స చేయించాలని నిర్ణయించారు. దీనికోసం గుంటూరు వైద్యశాలకు తరలించారు. అక్కడ రెండు కాళ్లకు ఆపరేషన్లు చేసిన తర్వాత గురజాల హాస్పిటల్కు తరలించారు.గురజాల సామాజిక ఆరోగ్య కేంద్రంలో అతనికి చికిత్స అందిస్తున్నారు.

అప్పటినుంచి అతనికి కాపలాగా ఓ ఏ ఆర్ కానిస్టేబుల్ పహారా ఉన్నాడు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఏఆర్ సిబ్బంది అలేఖ మంచం దగ్గరికి వెళ్లి చూశారు.. అప్పటివరకు అతను పడుకున్నాడని అనుకున్నారు.. దగ్గరికి వెళ్లి చూసేసరికి దిండు, కర్రల సంచి మీద నుంచి దుప్పటి కప్పి అతను పరారైనట్లుగా గుర్తించారు.

కాళ్లకు ఆపరేషన్ అయిన అలేఖ ఎలా వెళ్లాడని విచారణ జరపగా.. హాస్పిటల్లో ఉన్న వీల్ చైర్ తో సహా అతను పరారైనట్లు పోలీసులు అంటున్నారు. రెండు కాళ్లకు ఆపరేషన్ అయిన నేపథ్యంలో అతని కాళ్లు నడవడానికి సహకరించవని వైద్యులు తెలిపారు. అయితే ఈ క్రమంలోనే హాస్పిటల్ లోనే ఒక వీల్ చైర్ కూడా కనిపించడం లేదని తెలిసింది. దీంతో ఉద్దగిరి అలేఖ ఆస్పత్రిలోని వీల్ చైర్ సహాయంతో పారిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. అతనిని పట్టుకోవడంలో భాగంగా నగరంలోని అనేక కూడళ్ళల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజిని పరిశీలిస్తున్నారు.