ఆత్మీయ సభలో వ్యూహాత్మకంగా మాట్లాడిన రేవంత్ ఎపి రాజకీయాలను, తెలంగాణకు లింక్ చేస్తూ కామెంట్స్
తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పిన రేవంత్ రెడ్డి ఇయ్యాల కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర విభజన సమయంలో 2014 ఎన్నికల్లో ఎపిలో కాంగ్రెస్, టిడిపిలు ఏం చేశాయో రేపటి ఎన్నికల్లో తెలంగాణలోనూ ఆ తరహా ప్రయోగం చేసి కేసిఆర్ కుటుంబాన్ని గద్దె దించుదామని రవేంత్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని తన నివాసం వద్ద జరిగిన ఆత్మీయులతో మాటముచ్చట కార్యక్రమంలో రేవంత్ ఆసక్తికరమైన రీతిలో ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డితో చేతులు కలిపారు. కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. రేవంత్ రెడ్డి ఏమన్నారో ఆయన మాట్లల్లోనే చదవండి.
2006లో జడ్పీటిసిగా గెలిచిన. 2008లో ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీగా గెలిచిన. ఆనాడు జైపాల్ రెడ్డి కేంద్ర మంత్రి, జానారెడ్డి మంత్రి, సబితక్క గనుల శాఖ మంత్రి వీళ్లతో నాకు బంధుత్వం ఉంది. రాజశేఖరరెడ్డి కుటుంబంతో నాకు సన్నిహితం ఉండే. అయినా ఆనాడు నేను కాంగ్రెస్ లో చేరకుండా తెలుగుదేశం లో చేరిన. దేవెగౌడ ను ప్రధాన మంత్రి చేసిన వ్యక్తి చంద్రబాబు. ఆనాడు ప్రధాని పదవి తీసుకోకుండా దేవెగౌడ్ ను చేశారు. ప్రధాని పదవి కంటే తెలుగు రాష్ట్రాల అభివృద్ధే ముఖ్యమని త్యజించారు చంద్రబాబు.
ఆనాడు ఉభయ రాష్ట్రాల్లో వైఎస్ పాలనలో కాంగ్రెస్ బలంగా ఉన్నది. కానీ నేను టిడిపిలో చేరాను. ఆనాడు నేను కావాలంటే పదవి తీసుకుని కాంగ్రెస్ పార్టీలోనే చేరేవాడిని. అయినా ప్రతిపక్షంలో ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని నేను ప్రతిపక్షంలో చేరాను. ఆమేరకు నేను టిడిపిలో ఉండి పదేళ్ల పాటు పోరాటం చేశాను.
టిడిపికి తెలంగాణలో 10లక్షల మంది క్రియాశిల సభ్యత్వం చేశాను. ప్రజాస్వామ్య స్పూర్తితో పనిచేస్తున్నాము. కానీ ముఖ్యమంత్రి కేసిఆర్ తన స్వార్థ ప్రయోజనాల కోసమే తప్ప తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు కేసిఆర్ పనిచేయడంలేదు. 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం కోట్లాడి ప్రజల ఆకాంక్ష తెలంగాణ ఉద్యమం. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. నేను ఉద్యమంలో ముందున్న నేనే తెలంగాణను అభివృద్ధి చేస్తా అని జనాలను నమ్మబలికి కేసిఆర్ యన ముఖ్యమంత్రి అయిండు.
ఆరు దశాబ్దాల కలను, తెలంగాణ బిడ్డల త్యాగాలను మీరు (సోనియాగాంధీ) గుర్తించి తెలంగాణ ఇచ్చిర్రు. మాకు తెలంగాణ తప్ప ఇంకో ద్యాస లేదని చెప్పి కేసిఆర్ ఆమెకు దండం పెట్టిండు. కేసిఆర్ అంటోడు ఎప్పుడు రెండు నాల్కలు, రెండు విధానాలు కలిగిన వాడు, రెండు మాటలు మాట్లాడేటోడు అని ఆనాడు ఆమెకు తెల్వదు.
తెలంగాణ రాష్ట్రం అన్న రాష్ట్రాల మాదిరిగా ఆశామాషీ గా ఏర్పాటైంది కాదు. తెలంగాణ కోసం 1200 మంది బిడ్డలు ఆత్మబలిదానాలు చేసుకున్నరు. ఆ అమరుల కుటుంబాలను ఆదుకోవాల్సి ఉండె. విద్యార్థులు భవిష్యత్ కోసం విద్యార్థుల కొలువుల కోసం ఆలోచన చేయాల్సి ఉండే. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 40 నెలల కాలంలో కేసిఆర్ ఆ పనిచేయలే.
శ్రీకాంత చారి, యాదయ్య, ఇషాన్ రెడ్డి లాంటి వాళ్ల బలిదానాలతో ముఖ్యమంత్రి కుర్చీ మీద కూసున్నడు. కానీ దళితులకు, గిరిజనులకు మూడు ఎకరాల భూమి ఇవ్వలే. కేజి పిజి ఉచిత నిర్భంద విద్య ఇవ్వలే. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇయ్యలే. కేసిఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు.
ఇవి చేయకుండా ఏం చేసిండంటే.. టివి, చానెల్ పెట్టుకున్నడు. పేపర్ పెట్టుకున్నడు. 500 ఎకరాల్లో ఫాం హౌస్ కట్టుకున్నడు. 10 ఎకరాల్లో గడీ కట్టుకున్నడు. 1200 మంది విద్యార్థుల త్యాగాల మీద ఏర్పడ్డ తెలంగాణలో తన కుటుంబ సభ్యులు నలుగురి విలాస జీవితం కోసమే తెలంగాణలో లక్షల కోట్ల బడ్జెట్ ను వాడుకుంటున్నడు.
చెప్పిన దానికంటే చెప్పనిది చాలా చేస్తున్న అంటున్నడు. నేను అదే అంటున్న 14 ఏళ్లలో చెప్పింది వదిలేసి చెప్పనిది చేస్తున్నడు. నీళ్లు, నియామకాల గురించి 14 ఏండ్లు చెప్పిండు. ఇప్పుడు ఆ ముచ్చటే మరిచిపోయిండు. ఉద్యోగాలియ్యమంటే బర్రెలు, గొర్రెలు, మేకలు ఇస్త అంటున్నడు. బర్రెలు, గొర్రెలు, మేకలు, బతుకమ్మ చీరల కోసం ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటరా? వాటికోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందా?
బతుకమ్మ చీరలల్ల సంపాదించిన సొమ్ము సింగరేణి ఎన్నికలల్ల పెట్టిండు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ గురించి 14 ఏళ్లలో మాట్లాడినవా? పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడినవా? 500 ఎకరాల ఫామ్ హౌస్ గురించి మాట్లాడినవా? 10 ఎకరాల్లో గడీ కడతా అని మాట్లాడినవా? ఇవన్నీ మనుసులో పెట్టుకుని అధికారంలోకి రాగానే చేసినవా? తెలంగాణ విద్యార్థులు మళ్లీ పుస్తకాలు పక్కన పెట్టి ఉద్యమ బాట పట్టే పరిస్థితి వచ్చింది. ఉస్మానియా విద్యర్థులు అవగాహన లేనోళ్లు అని హేళన చేసినవంటే ఎలాంటి పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయో తెలుసు.
ఎపిలో అమరావతి నిర్మాణం కోసం అహర్నిషలు పనిచేస్తుంటే తెలంగాణలో కేసిఆర్ ఏం చేస్తున్నడు.
మోకాళ్లకాడికి లాల్చీ వేసుకునేటాయన బిజెపి లీడర్ మురళీధర్ రావు టిడిపితో పొత్తు వద్దు అంటడు. ఎందుకొద్దు? టిడిపి, బిజెపి పొత్తు పెట్టుకుంటే కేసిఆర్ మళ్లీ అధికారంలోకి రాడు అని అందుకే వద్దంటున్నడు. ఒకపక్క విద్యాసాగర్ రావు, ఇంకో పక్క మురళీధర్ రావు అందరూ కూడబల్కుకొని కేసిఆర్ ను మల్లా ముఖ్యమంత్రిని చేయాలని పనిచేస్తున్నారు.
నరేంద్ర మోడీ, కేసిఆర్ కలిసే ఉన్నరు. ఒకసారి మోడీ నిర్ణయాలు బాగున్నాయి అంటరు ఒకసారి బాగాలేవని అంటరు కేసిఆర్. వాళ్లిద్దరూ కలిసే ఉన్నారని అన్నాడు ఒక బిజెపి పెద్ద నాయకుడు. నోట్ల రద్దు కేసిఆర్ సమర్థించిండు. జిఎస్టీ ని సమర్థించిండు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మాకే ఓటేసిండు కాబట్టి మాతోటే కేసిఆర్ కలిసి ఉన్నడా లేడా అని చెప్పమన్నడు ఆ నాయకుడు. కేసిఆర్ కుటుంబంతో తెలంగాణ సమాజానికి ప్రమాదం ఉందా లేదా? ఆ దోపిడీని అడ్డుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మీరు సూచన చేయండి. కేసిఆర్ బిజెపితో కలిసే ఉన్నడు. తెలంగాణలో నలుగురు దోచుకుంటున్నరా? లేదా?
నేను రాజీనామా చేయగానే సక్కగ నా అధిష్టానం (కొడంగల్) దగ్గరికి పోయిన. కొడంగల్ లో అందరినీ అడిగిన. ఏం చేస్తామో చెప్పాలని అడిగిన. కొడంగల్ ప్రజలు నేను ఏ నిర్ణయం తీసుకున్నా నీతోనే ఉంటాం అని అన్నారు. తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడినమో అలాగే కేసీఆర్ ను దించడానికి పోరాటం చేయాలి. నేడు తెలంగాణలో ఆ నలుగురు ఒక పక్క నాలుగు కోట్ల ప్రజలు ఒక.పక్క అయిర్రు. వచ్చిన తెలంగాణ లో నక్షలైట్ల పేరుతో వేధింపులు ఎక్కువయ్యాయి. అందుకే కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ జరగాలి.

పసుపు జండా కు ఎవరు వ్యతిరేకం కాదు. నాలో ఉంది పసుపు రక్తం. టీడీపీ ని చంపాలని పుట్టిన పార్టీ trs. టీడీపీ కార్యకర్తలను ఇన్ని ఇబ్బందులు పెడుతున్న trs తో మనం కలవాలా? ఎన్నడైనా కేసిఆర్ తెలుగుదేశం పార్టీని, కార్యకర్తలను గౌరవించిండా? 2014 ఎన్నికల్లో ఆంధ్రాలో కాంగ్రెస్ నాయకత్వం అంతా కలిసి చంద్రబాబును అధికారంలోకి తీసుకురాలేదా? కాంగ్రెస్ నాయకులంతా టిడిపిలో చేరి అధికారంలో భాగస్వాములు కాలేదా? అప్పటి వరకు కాంగ్రెస్ లో ఉన్న జెసి దివాకర్ రెడ్డి టిడిపిలో చేరి టిడిపిని గెలిపించలేదా? టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి లాంటి వారంతా టిడిపిలో చేరి అధికారంలోకి తేలేదా? నేడు కూడా తెలంగాణలో కేసిఆర్ ను దించడానికి కాంగ్రెస్, టిడిపి కలవాల్సిన చారిత్రక అవసరం ఉందన్నారు.
AP కి ప్రమాదం వచ్చినప్పుడు కాంగ్రెస్ టీడీపీ కలవలేదా? 1996 లో కాంగ్రెస్ మద్దతు తో టీడీపీ నేతలు మంత్రులు కాలేదా? తెలంగాణ ప్రమాదం లో ఉన్నప్పుడు మనం కాంగ్రెస్ కు మద్దతు గా ఉంటే తప్పు ఎలా అవుతుంది? మనం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం మద్దతు ఇస్తే తప్పేంటి? మనం సోనియాగాంధీ నాయకత్వంలో పనిచేద్దామా? వద్దా? తెలంగాణలో ఉత్తమ్ తో చేతులు కలుపుదామా?
తెలంగాణ సమాజం లేచి నిటారుగా నిలబడ్డది. కేసిఆర్ కాళ్ల కింద ఉండదలుచుకోలేదు తెలంగాణ సమాజం. కేసిఆర్ తో కలబడేందుకే సిద్ధపడ్డది తెలంగాణ సమాజం. ఈ తరుణంలో రాహుల్ గాంధీ సమక్షంలో పనిచేయడానికి కాంగ్రెస్ లో చేరుతున్నాం. అంటూ సమావేశ వేదిక మీదున్న ఉత్తమ్ కుమార్ రెడ్డితో కరచాలనం చేస్తూ స్పీచ్ ముగించారు రేవంత్ రెడ్డి.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఏషియా నెట్ ఎక్స్ ్రపెస్ న్యూస్ కోసం
