అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా ఉందాం : మంత్రి గంగుల కమలాకర్
Hyderabad: అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా ఉందామనీ, ఊహించని ప్రకృతి విపత్తుని సమన్వయంతో ఎదుర్కొందామని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అలాగే, ఎఫ్‌సీఐ ఎఫ్ఏక్యూ నిబంధనలను సవరించాలని మరోసారి కేంద్రాన్ని కోరుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో రికార్డు స్థాయి పంట చేతికివచ్చినా ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు నెలకొనడం దురదృష్టకరమని అన్నారు.
Telangana Minister Gangula Kamalakar: అకాల వర్షాలతో రాష్ట్రంలో చేతికొచ్చిన పంట నష్టపోయి రైతులు ఇబ్బందుల్లో ఉంటే వారికి అందరం సహకరించాలనీ, ధాన్యం సేకరణ వేగవంతంగా జరిగేలా ప్రభుత్వ యంత్రాంగం చేసే కృషికి బాధ్యత గల మిల్లర్లుగా రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ సహకరించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం సచివాలయంలో రాష్ట్ర మిల్లర్ల సంఘం ప్రతినిధులు, సివిల్ సప్లైస్ శాఖ ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన క్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఖమ్మం, నిజామాబాద్ లలో ధాన్యం అన్ లోడింగ్ ఇబ్బందులు ఎదురవుతున్నాయనేది తమ దృష్టికి వచ్చిందనీ, ఎట్టిపరిస్థితుల్లోనూ కొనుగోలు కేంద్రం నుండి పంపిన ధాన్యాన్ని దింపుకోవాలన్నారు. ఆ రెండు జిల్లాలకు సంబందించిన సమస్యలపై చర్చించిన మంత్రి అప్పటికప్పుడే జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా యంత్రాంగాన్ని సమన్వయ పరుచుకుని సేకరణ వేగవంతంగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పదే పదే తడిచిన ధాన్యం మిల్లింగుకు పనికిరాకుండా పాడవుతుందని, నూక శాతం పెరగడంతో పాటు రంగుమారుతుందనీ, దీనిని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఆమోదించకపోవడంతో నష్టం జరుగుతుందని మిల్లర్లు పేర్కొన్నారు. దీనికి మంత్రి గంగుల స్పందిస్తూ ఇప్పటికే కనీస నాణ్యతా ప్రమాణాలను సడలించాలని ఎఫ్‌సీఐ కి లేఖ రాసామని, మరోసారి దీనిని ఆమోదించవలసిందిగా కేంద్రానికి విజ్ణప్తి చేసినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దనే క్రుతనిశ్చయంతో ఉన్నారనీ, ఎవరూ నష్టపోకుండా అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందన్నారు. దేశానికే అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ గెలిచి నిలిచిందనీ, ఎటికేడు రికార్డు స్థాయిలో ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్నామని, ఐతే ఈ యాసంగిలో వరుసగా కురిస్తున్న అకాల వర్షాలతో అన్నధాతలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వెలిబుచ్చారు.
ఈ క్లిష్ట సమయంలో పౌరసరఫరాల శాఖ సవాల్ గా తీసుకొని ధాన్యం సేకరణ చేస్తుందని, ఇందులో భాగస్వాములైన ప్రతీ ఒక్కరూ చిత్తశుద్దితో రైతులకు అండగా నిలవాలని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. ఇబ్బందికర పరిస్థితుల్లోనూ తెలంగాణ ప్రభుత్వం రైతుల నుండి ధాన్యాన్ని సేకరిస్తుందని, వర్షాలు కురుస్తున్నప్పటికీ రోజుకు సరాసరిగా లక్ష మెట్రిక్ టన్నులకు పైగా సేకరిస్తున్నామని, ఇవాల ఏకంగా 1లక్షా 61వేల మెట్రిక్ టన్నులు సేకరించి నేటి వరకూ గతం కంటే రెట్టింపుగా ధాన్యాన్ని సేకరించామన్నారు. గత సంవత్సరం ఇదే రోజు 8 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా నేటి వరకూ 15.38లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామన్నారు. దీనిని 6087 కొనుగోలు కేంద్రాల్లో 1లక్షా 7వేల మంది రైతుల నుండి కొన్నామని దీని విలువ 3161 కోట్ల రూపాయలని మంత్రి తెలిపారు. ఈ సమీక్షలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ ఛైర్మన్ రవీందర్ సింగ్, కమిషనర్ వి.అనిల్ కుమార్, రైస్ మిల్లర్ సంఘం అధ్యక్షులు గంపా నాగేందర్, ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, ఇతర మిల్లర్లు, అధికారులు పాల్గొన్నారు.