Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ డిఎస్సీపై మళ్లీ లీక్ లు

  • తెలంగాణ డిఎస్సీపై కొత్త లీక్ లు
  • ఇంకా ఆగని నిరుద్యోగుల జోక్ లు
  • సర్కారు తీరుపై భగ్గుమంటున్న టీచర్ అభ్యర్థులు
Leaks mar dsc and jokes go on

తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీకోసం డిఎస్సీ వేస్తారో వేయరో తెలియదు కానీ గత మూడేళ్లుగా లీకుల మీద లీకులు ఇస్తూనే ఉన్నారు. ఈ లీకులు చూసి టీచర్ అభ్యర్థులు ఆశపడడం, తర్వాత అసలు విషయం తెలిసి బాధపడడం షరా మామూలుగా మారిపోయింది. తాజాగా డిఎస్సీ ఫైలు సిఎం కేసిఆర్ వద్దకు చేరిందని, ఆయన సంతకం పెట్టిన వెంటనే నోటిఫికేషన్ విడుదలకు మార్గం సుగుమం అయినట్లేనని ఒక లీక్ బాహ్య ప్రపంచంలో చక్కర్లు కొడుతున్నది. దానిలోనే ఇంకో ముచ్చటేమంటే పాత పది జిల్లాల ప్రాతిపదకనే డిఎస్సీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారని కూడా ఉంది.

ఈ తరహా లీకులు గడిచిన మూడేళ్లుగా వస్తూనే ఉన్నాయి. అదిగో డిఎస్సీ, ఇదిగో డిఎస్సీ, అప్పుడు డిఎస్సీ, ఇప్పుడు డిఎస్సీ అని కొన్ని రోజులు కాలమెల్లదీశారు. తర్వాత త్వరలో డిఎస్సీ అంటూ కొత్త పల్లవి అందుకున్నారు తెలంగాణ పాలకులు. ఇలాంటి డైలాగులు విన్న నిరుద్యోగ టీచర్ అభ్యర్థులు ఏం చేయాలో తోచక నిస్సహాయ స్థితిలోకి నెట్టబడుతున్నారు. తెలంగాణ సర్కారుకు టీచర్ జాబులు ఇవ్వాలన్న చిత్తశుద్ధి ఉంటే ఒక్క డిఎస్సీ వేయడానికి మూడేళ్ల సమయం పడుతుందా అని నిరుద్యోగ టీచర్ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకపోవడం చూస్తే... విద్యారంగాన్ని ఏమాత్రం బలోపేతం చేస్తున్నారో తెలిసిపోతుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి సిఎం వద్దకు ఫైల్ అంటే ఇంతకాలం అధికార వర్గాలు ఏం పని చేశారో చెప్పాలని నిరుద్యోగ టీచర్ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత తొలి కేబినెట్ లోనే టీచర్ పోస్టులను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకపోవడం బాధాకరమంటున్నారు.

తెలంగాణ డిఎస్సీపై సర్కారు వైపు నుంచే రకరకాల వివాదాలను సృష్టించి నోటిఫికేషన్ వేయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. కొంతకాలం కొత్త జిల్లాలే డిఎస్సీకి అడ్డంకి అన్న వివాదం నెలకొంది. ఇంకొంత కాలం జోన్ల విషయంలో వివాదమంటూ లీక్ లు ఇచ్చారు. ఇక కొత్త జిల్లాల వారీగానా? పాత జిల్లాల వారీగానా అన్న వివాదం ఇంకొంత కాలం నడిపారు. ఏకీకృత సర్వీసు రూల్స్ వివాదాన్ని కూడా డిఎస్సీ వివాదంగా మలిచారు. మరోవైపు టీచర్ పోస్టుల భర్తీని పక్కనపెట్టి పిల్లలు లేరన్న సాకుతో పాఠశాలల మూసివేత పకడ్బందీగా చేపట్టారు. ఇలా రకరకాల వివాదాలను సర్కారు వైపునుంచే సృష్టిస్తున్నారని నిరుద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు.

ఇక డిఎస్సీపై జోక్ లు కూడా ఆగడంలేదు. రోజుకో కొత్త జోక్ సృష్టించి నిరుద్యోగులు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. సర్కారులో స్పందన రావడం కోసం జోక్స్ పోరాటానికి దిగినట్లు నిరుద్యోగులు చెబుతున్నారు.

కేసిఆర్ సర్కారు తీరు దారుణం : బాల లక్ష్మి, ఓయు జెఎసి

సాధారణంగా ఏదైనా కార్యక్రమం ప్రభుత్వం చేయాలనుకుంటే అభ్యంతరం ఉన్నవాళ్లు కోర్టులకు వెళ్తారు, అడ్డుకుంటారు కానీ... ఇక్కడ మాత్రం సర్కారే వివాదాలు సృష్టించడం దారుణమని ఓయు జెఎసి అధికార ప్రతినిధి బాల లక్ష్మి విమర్శించారు. ఆమె ఏషియా నెట్ తో మాట్లాడుతూ కేసిఆర్ సర్కార్ కు టీచర్ పోస్టులు భర్తీ చేయాలన్న ఉద్దేశం ఏమాత్రం లేదని ఆమె ఆరోపించారు. అందుకోసమే రోజుకో నాటకం ఆడుతూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ఇదే ఎపి సర్కారు ఇప్పటికే ఒక డిఎస్సీ జరిపి ఇంకో డిఎస్సీకి ఏర్పాట్లు చేస్తుండగా ఇక్కడ మాత్రం ఇంకా త్వరలోనే అంటున్నారని ఎద్దేవా చేశారు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

Follow Us:
Download App:
  • android
  • ios