ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు కరోనా పేరు వింటేనే భయపడిపోతున్నారు. సాధారణ జలుబు, తుమ్ములు, దగ్గులు వచ్చినా కూడా కరోనా సోకిందేమో అని కంగారుపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో... ఓ సీఐ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చాడు.

పాట రూపంలో కరోనాపై అవగాహన కల్పిస్తున్నాడు.. ఎల్‌బీనగర్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ అంజపల్లి నాగమల్లు. ఇప్పటి వరకు ఆయన అనేక సామాజిక సమస్యలపై పాటలు రాసి, తన గళంతో అవగాహన కల్పించారు. తాజాగా కరోనా పై ప్రజలు అనవసర భయాందోళనలకు గురౌతున్నారని గుర్తించి దాని గురించి ప్రత్యేకంగా ఆయనే స్వయంగా పాట రాశారు.

Also Read కరోనా వైరస్ అరికట్టేందుకు యాక్ట్‌ ఫైబర్‌నెట్‌ అధ్భుతమైన ఆఫర్‌...

తాను రాసుకున్న పాటను ఆయనే ఆలపించారు. అనంతరం ఆ పాటను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా... ఇప్పుడు ఆయన పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, వాట్సాప్‌, యూట్యూబ్‌ సహా ఒక్కరోజులోనే పదివేలమందికి చేరువైందని నాగమల్లు తెలిపారు. ఆయన పాటపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

సీఐ నాగమల్లు రాసిన పాట ఇదే...

భయపడవద్దండి భద్రత పాటిద్దాం..  కలిసికట్టుగా కరోనా అరికట్టేద్దాం..!

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే చాలు.. వ్యక్తిగత శుభ్రత చేస్తుంది మేలు..!

జ్వరము దగ్గు జలుబు శ్వాసలో ఇబ్బందులుంటే..

డాక్టర్‌ను సంప్రదించి కారణాలు తెలుసుకోండి..!

కరోనా అంటూ మీరు కంగారు పడవద్దు.. నివారణ తెలుసుకొని మసులుకుంటే ముద్దు.

ముఖంపైన దగ్గకుండా పక్కకు తల తిప్పండి..

తుమ్మెస్తే ఆరు ఫీట్ల దూరం పాటించండి..!

కడగకుండా గ్లాసులోన నీళ్లను తాగొద్దు..

హలో కంటే నమస్కారమే ఇప్పుడు ముద్దు..!

కడగనట్టి చేతులతో కళ్లను రుద్దవద్దు.. 

ముక్కు, నోరును చేతితో ముట్టుకోకు ప్రతిసారి..!

అన్నం తినే ముందర చేతులను శుభ్రపరుచు.. 

జాగ్రత్తలు పాటిస్తే తగ్గుతుంది నీకు ఖర్చు..!

మంది ఎక్కువున్నకాడ మాస్కులనే ధరించాలి.. 

ప్రతిసారి సబ్బుతోని చేతులను కడగాలి..!

అవగాహనతో కరోనా అంతం చేద్దాం రండి..

వదంతులు నమ్మవద్దు వందనాలు మీకండీ..!