కరీంనగర్: లాయర్ దంపతులు వామన్ రావు, నాగమణి దంపతుల హత్యపై బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ను లక్ష్యంగా చేసుకుని ఆయన ఆరోపణలు చేశారు. కేసీఆర్ కు వామన్ రావు దంపతుల హత్య ద్వారా గిఫ్ట్ ఇచ్చారని, హత్యపై కేసీఆర్ స్పందించకపోతే ఆ గిఫ్ట్ ను స్వీకరించినట్లేనని ఆయన అన్నారు. 

ఆస్పత్రిలో వామన్ రావు దంపతుల మృతదేహాలను బండి సంజయ్ పరిశీలించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. లాయర్ దంపతుల హత్యపై స్పందించకపోతే హత్యను కేసీఆర్ సమర్థించినట్లేనని ఆయన అన్నారు. 

Also Read: వామన్ రావు దంపతుల హత్య కేసులో వెలుగులోకి విస్తుపోయే విషయాలు

కేసీఆర్ ప్రభుత్వానికి మూడిందని ఆయన అన్నారు. రాజకీయ సమాధి చేసుకోవడానికి కేసీఆర్ పునాదులు వేసుకుంటున్నారని ఆయన అన్నారు. టీఆర్ఎస్ గుండాలు వామన్ రావు దంపతులను హత్య చేశారని ఆయన ఆరోపించారు. ఇది ఇద్దరో ముగ్గురో చేసిన హత్య కాదని, దీని వెనక టీఆర్ఎస్ పెద్దలు ఉన్నారని ఆయన అన్నారు. 

హత్య వెనక ఉన్న టీఆర్ఎస్ పెద్దలు ఎవరో బయటకు రావాలని ఆయన అన్నారు. అందుకు సమగ్ర విచారణ జరపడం అవసరమని, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, కేసును హైకోర్టు సూమోటోగా స్వీకరించాలని ఆయన అన్నారు. టీఆర్ఎస్ లోని కొందరు పెద్దల అవినీతి చిట్టా వామన్ రావు వద్ద ఉందని, వాటిని మాయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. వామన్ రావు చేపట్టిన కేసులపై విచారణకు ప్రత్యేకమైన బెంచ్ ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. 

హైకోర్టును ఆశ్రయించినప్పటికీ వామన్ రావుకు భద్రత కల్పించలేదని ఆయన విమర్శించారు. ప్రజలందరూ చూస్తుండగా హత్య చేశారని, ఈ హత్యల వెనక ఉన్నదెవరో బయటకు రావాలని ఆయన అన్నారు. కేసుల విషయంలో వామన్ రావు రాజీ పడబోడని, అందుకే ఆయనను హత్య చేశారని బండి సంజయ్ అన్నారు. 

వామన్ రావు దంపతుల హత్యకు నిరసనగా గురువారం అఖిల పక్షం మంథని బంద్ కు పిలుపునిచ్చింది. వామన్ రావు హత్యకు నిరసనగా తెలంగాణలో న్యాయవాదులు విధులను బహిష్కరించారు.