Asianet News TeluguAsianet News Telugu

వామన్ రావు దంపతుల హత్య కేసులో వెలుగులోకి విస్తుపోయే విషయాలు

లాయర్ దంపతులు వామన్ రావు, నాగమణి హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న కుంట శ్రీను ఆడియో క్లిప్ కేసులో కీలకంగా మారింది.

Lawyer couple murder: Kunta Sreenu audio clip found
Author
Peddapalli, First Published Feb 18, 2021, 8:58 AM IST

పెద్దపల్లి: లాయర్ దంపతులు వామన్ రావు, నాగమణి హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. కుల దేవత గుడి వివాదమే వారి హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కులదేవత గుడిని కూల్చివేస్తే వామన్ రావు కూలిపోతాడని కుంట శ్రీనివాస్ అన్నట్లు తెలుస్తోంది.

వామన్ రావు దంపతుల హత్య కేసులో కుంట శ్రీను ఆడియో క్లిప్ కీలకంగా మారింది. గుంజపడుగులోని ఆలయ వివాదం కారణంగానే వామన్ రావు దంపతులను హత్య చేసినట్లు భావిస్తున్నారు. వామన్ రావు డ్రైవర్ ద్వారా కుంట శ్రీనుకు సంబంధించిన ఆడియో క్లిప్ ను పోలీసులు సేకరించారు. 

కుంట శ్రీనుపై పలు కబ్జా, బెదిరింపు కేసులున్నాయి. కుంట శ్రీను కాల్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. కుమార్, చిరంజీవి, దాస్ అనే ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  

పెద్దపల్లి జిల్లాలో పట్టపగలే హైకోర్టు అడ్వకేట్ వామనరావు దంపతులను హత్య చేసిన విషయం తెలిసిందే. దుండగులు. కారులో వెళ్తున్న వామనరావు.. అతని భార్య నాగమణిపై కత్తులతో దాడి చేశారు. అడ్వకేట్ వామన్ రావు చనిపోతూ… తనపై హత్య చేసిన వ్యక్తి పేరు కుంట శ్రీను అని చెప్పారు.

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామం దగ్గరలో పట్టపగలే నడిరోడ్డుపై వామనరావు దంపతులపై దాడి చేశారు దుండగులు. కోర్టు పనిమీద మంథనికి కారులో వచ్చి… తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా… వీళ్ళని కల్వచర్ల దగ్గర అడ్డుకుని కత్తులతో విచరక్షణారహితంగా దాడి చేశారు. దంపతుల్ని కారు దిగనీయకుండానే…. లోపలే దాడికి పాల్పడ్డారు. కొన ఊపిరితో ఉన్న దంపతులను హాస్పిటల్ కు తీసుకెళ్తుండగానే చనిపోయారు. వామనరావు, అతని భార్య  ఇద్దరు హైకోర్టు అడ్వకేట్లు. గట్టు లా చాంబర్స్ పేరుతో లా ఫర్మ్ ను నడుపుతున్నారు.

దుండగుల దాడి తర్వాత కొద్దిసేపు రోడ్డు పైనే ప్రాణాలతో పోరాడారు అడ్వకేట్ వామనరావు. ఇదే టైంలో అక్కడున్నవాళ్లు నిందితులు మీకు తెలుసా అని అడిగినప్పుడు… తెలుసు అంటూ తల ఊపారు వామనరావు. తర్వాత కుంట శీను దాడి చేశారని..అతనిది గుంజపడగ అని చెప్పాడు.

అడ్వకేట్ వామన్ రావు… తనపై దాడి చేశారని చెప్పిన కుంట శీనుది మంథని మండలం గుంజపడగ గ్రామం. ప్రస్తుతం శీను మంథని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు. గుంజపడగ సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయాడు. పెద్దపల్లి జెడ్పి చైర్మన్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ప్రధాన అనుచరుడని ప్రచారం జరుగుతోంది. కుంట శీనుకు వ్యతిరేకంగా వామనరావు కేసు వేశాడని.. ఆ కక్షతోనే కుంట శీను దాడి చేశాడని అనుమానిస్తున్నారు. దాడి నుంచి కారు డ్రైవర్ తప్పించుకున్నాడు. ప్రస్తుతం పోలీసులు ఆయన్ని విచారిస్తున్నారు.

గతంలో వామన్ రావు రాజకీయనేతల అవినీతిని ప్రశ్నిస్తూ అనేక కేసులు వేశారు.  ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఈ కేసులను ఫైల్ చేశారు.  ఆ కక్షతోనే హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే తనకు ప్రాణహాని ఉందని… రక్షణ కల్పించాలని వామన్ రావు గతంలో ప్రభుత్వానికి అప్పీల్ చేసుకున్నారు. అందరికీ సెక్యూరిటీ ఇవ్వడం సాధ్యం కాదంటూ ఆయన అభ్యర్థనను సర్కార్ తిరస్కరించినట్టు హైకోర్టు సీనియర్  అడ్వకేట్స్ చెబుతున్నారు. వామన్ రావు హత్యను హైకోర్టు అడ్వకేట్స్ ఖండించారు.

Follow Us:
Download App:
  • android
  • ios