హైదరాబాద్: అమరావతికి ప్రధాని నరేంద్ర మోడీ మట్టి, నీళ్లు మాత్రమే ఇస్తున్నారని తెలిసి రూ.100 కోట్లు ఇద్దామని భావించి తమ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వెనక్కి తగ్గారని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేత కేటీ రామారావు చెప్పారు. 

ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిని నిర్మించుకోవాలని అక్కడి ప్రభుత్వం తలపెట్టిందని, ఇందులో భాగంగా రాజధాని శంకుస్థాపనకు ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులను, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా ఏపీ ప్రభుత్వం ఆహ్వానించిందని ఆయన గుర్తు చేశారు. 

అమరావతి నిర్మాణానికి రూ.100 కోట్లు ప్రకటించాలని మంత్రివర్గం సమ్మతితో కేసీఆర్ అప్పట్లో నిర్ణయించారని కేటీఆర్ చెప్పారు. సంతోషంగా అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ వెళ్లారని, అక్కడ ఆయనకు సాదర స్వాగతం లభించిందని అన్నారు. అక్కడి ప్రజలు కూడా కేసీఆర్‌కు బ్రహ్మరథం పట్టారని ఆయన అన్నారు. 

శంకుస్థాపన భలో కేసీఆర్‌ను తొలుత ప్రసంగించాల్సిందిగా కోరారని గుర్తుచేశారు. అప్పటికే వంద కోట్లు ప్రకటించాలని నిర్ణయంతో ఉన్న కేసీఆర్ తొలుత కేంద్రం ఏం ఇస్తుందో తెలుసుకునేందుకు ప్రధాన మంత్రి కార్యదర్శిని సంప్రదించారని చెప్పారు. మట్టి, నీళ్లు మాత్రమేనని ఇస్తున్నారని చెప్పారని,. దీంతో కేసీఆర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని ఆయన చెప్పారు. 

ఒకవేళ తాను వంద కోట్లు ప్రకటించి ప్రధాని మోడీ ప్రకటించకపోతే వివాదం చెలరేగుతుందనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారని చెప్పారు. అమరావతికి ప్రధాని ఏమీ ప్రకటించకపోవడంపై కేసీఆర్ హైదరాబాదు వచ్చిన తర్వాత ఆశ్చర్యం వ్యక్తం చేశారని ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

అలా అడిగితే ఇలా చెప్పా: చంద్రబాబుపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఎన్టీఆర్ మీద కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు