హైదరాబాద్: దివంగత నేత ఎన్టీ రామారావుపై తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేత కేటీ రామారావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ వల్లనే తెలుగు వాళ్లకు గుర్తింపు వచ్చిందని ఆయన అన్నారు. చరిత్ర మలుపులు తిరిగినప్పుడు కొన్ని అనివార్యమైన మార్పులు జరుగుతాయని, ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన తర్వాత అదే జరిగిందని ఆయన అన్నారు. 


జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని ఆయన అన్నారు. 70 సంవత్సరాలు కాంగ్రెస్, బీజేపీ కలిసి దేశాన్ని నాశనం చేశాయని కేటిఆర్ అన్నారు. అటు ఆంధ్రాకు, ఇట తెలంగాణకు జాతీయ పార్టీలు అన్యాయం చేశాయనివిమర్శించారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ ఆనాడే చాటి చెప్పారని గుర్తు చేశారు. 

కూకట్‌పల్లిలోని రాఘవరెడ్డి గార్డెన్‌లో మన హైదరాబాద్.. మనందరి హైదరాబాద్ పేరిట నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్, బీజేపీలది ఒకటే వైఖరి అని విమర్శించారు. ఢిల్లీ పెత్తనం మనకు అవసరమా అని ఆయన ప్రశించారు.  బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా నోరెత్తితే లక్షల కోట్లు ఇచ్చామని అంటున్నారని, ఆయన ఇంటెనుక పొలం అమ్మి ఇచ్చారా అని ఆయన అన్నారు. 

జాతీయ పార్టీల్లో ఫెడరల్ స్ఫూర్తి లేదని విమర్శించారు. ప్రాంతీయ శక్తులు బలపడాలని, రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలను గెలిపించాల్సిన అవసరం చాలా ఉందని కేటీఆర్ అన్నారు. జాతీయ పార్టీలకు అడ్రస్ లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. ఏపీతో పాటు.. ఇతర రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలే గెలవాలని కేటీఆర్ అన్నారు.