హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నాయకుడు కెటి రామారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు పోరాటం చేయడంలో తప్పు లేదని, దిగువ రాష్ట్రం ముఖ్యమంత్రిగా నీళ్ల కోసం చంద్రబాబు పోరాడవచ్చునని ఆయన అన్నారు. 

మనం కలిసి ఉంటే బాగుంటదేమో అని చంద్రబాబు తనతో అన్నారని, అయితే ఇది సాధ్యం కాదని తాను సమాధానమిచ్చానని చెప్పారు. టీడీపీతో పొత్తు కుదరదని, మన ఆలోచనలు పరస్పర విరుద్ధమైనవని తాను చెప్పినట్లు ఆయన తెలిపారు. ఆంధ్రాలో టీడీపీని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు తాము చేయబోమని, మీరు కూడా తెలంగాణలో రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు పెట్టుకోవద్దని చెప్పానని ఆయన వివరించారు. 

టీడీపీ ఏపీ గురించి ఆలోచిస్తుందని, తాము తెలంగాణ బాగు గురించి ఆలోచిస్తామని తాను చెప్పానని కేటీఆర్ చెప్పారు. ఇలా పరస్పర విరుద్ధ లక్ష్యాలున్న పార్టీలు ఒకటిగా సాగలేవని చెప్పానని ఆయన అన్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారని ఆయన విమర్శించారు. 

తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు కూడా అడ్డుపడుతూ చంద్రబాబు లేఖలు రాశారని ఆయన విమర్శించారు. కూకట్‌పల్లిలోని రాఘవరెడ్డి గార్డెన్‌లో మన హైదరాబాద్.. మనందరి హైదరాబాద్ పేరిట ఆదివారం నిర్వహించిన సభకు కేటీఆర్ హాజరై ప్రసంగించారు. తమకు ఎవరితోనూ ఎవరితో గిల్లికజ్జాలు పెట్టుకొనే సమయం లేదని అన్నారు.

హైదరాబాదులోని సీమాంధ్ర ప్రజలకు వ్యక్తిగతంగా తాను అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. తమను నమ్మి మరోసారి అధికారం ఇస్తే అభివృద్ధి పనులు పూర్తిచేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో డ్రైనేజీ, రోడ్ల సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. 2014లో హైదరాబాద్‌లో టీఆర్ఎస్ పట్ల చాలా అనుమానాలు ఉండేవని, అయితే ఈ నాలుగేళ్ల పాలనలో వాటన్నింటినీ పటాపంచలు చేశామని చెప్పారు. దాని ఫలితమే గ్రేటర్ ఎన్నికల్లో అన్ని ప్రాంతాల వారు టీఆర్ఎస్‌కు బ్రహ్మరథం పట్టారని ఆయన గుర్తు చేశారు. 

ప్రాంతాలకతీతంగా పాలన సాగించామని చెప్పారు. తెలంగాణ వచ్చేంత వరకే గొడవ అని, ఈ నాలుగేళ్లలో ఎక్కడా ప్రాంతీయ వివక్ష జరగలేదని కేటీఆర్ తెలిపారు. 67 ఏళ్లలో హైదరాబాద్‌ ఎలా ఉండేదో.. ఈ నాలుగేళ్లలో ఎలా ఉందో చూడాలని ఆయన కోరారు. 

కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇక్కడి సెటిలర్లను ఉద్దేశించినవి కావని, టీడీపీనీ చంద్రబాబును ఉద్ధేశించి చేసినవని అన్నారు.  గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల సమయంలో నువ్వు లోకలా..? నేను లోకలా? అంటూ లోకేష్ తనకు సవాల్ విసిరారని గుర్తుచేశారు.  ప్రధాని అహం దెబ్బ తింటుందనే కేసిఆర్ ఎపికి ఏ విధమైన సాయం చేయలేదని ఆయన చెప్పారు.