Asianet News TeluguAsianet News Telugu

ఇదీ కెటిఆర్ ఆవేదన

తెలంగాణ సిఎం కెసిఆర్ కుమారుడు, రాష్ట్ర మంత్రి కెటిఆర్ ఒక విషయంలో అంతులేని ఆవేదనకు గురయ్యారు. ఆ విషయం తనకు నచ్చకపోవడంతో ఆయన బాధ పడ్డారు. విలువలు పతనమవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. తనకున్న ఆవేదనను ట్విట్టర్ లో పంచుకున్నారు కెటిఆర్.

KTR feels sorry for the falling standards in Telangana journalism

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు చిన్నాచితక స్కాములే వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర చరిత్రలో అతి పెద్ద స్కాము గా ప్రతిపక్షాలు అభివర్ణిస్తున్నది మియాపూర్ భూముల కుంభకోణాన్నే. దీనిలో కనీసానికి 15వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు విపక్షాలు సర్కారు మీద దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇంత పెద్ద స్కాము జరిగింది కాబట్టే దీనిని సిబిఐ కి అప్పగించాలంటూ విపక్షాలు కోరుతున్నాయి. తుదకు తెలంగాణ జెఎసి కూడా భూముల కుంభకోణంపై స్పష్టమైన డిమాండ్ ను సర్కారు ముందు ఉంచింది. తక్షణమే సిబిఐ విచారణ జరపాల్సిందేనని జెఎసి సూచించింది.దాదాపురెన్నెళ్లుగా మియాపూర్ అంటే భూకబ్జా అయిపోయింది.  కొన్ని పత్రికలు, దీనికి సూత్రధారి అయిన గోల్డ్ స్టోన్ ప్రసాద్ కెసిఆర్ కుటుంబానికి సన్నిహితుడుని రుజువు చేసేందుకు కూడా ప్రయత్నించాయి.

 

ఈ భూముల కుంభకోణం ఇప్పటికే ఒక అధికార పార్టీ ఎంపిని బోనులో నిలబెట్టింది. ఆయన తన కుటుంబం పేరిట రిజిస్టర్ అయిన భూములను వదులుకోవాల్సి వచ్చింది. దీంతోపాటు మరో ఎంపి కూడా ఈ కుంభకోణంలో ఇరుక్కున్నారు. ఆయన సైతం రేపోమాపో తన భూములను వదులుకునేందుకు సిద్ధపడ్డారు.

 

70 మందికి పైగా ఈ కుంభకోణంలో అధికారులపై సర్కారు చర్యలు తీసుకుంది. కొందరిని సస్పెండ్ చేసింది. మరికొందరిని బదిలీ చేసింది. అయినా ఇంచు భూమి కూడా ఇందులో పోలేదని, అంతా సేఫ్ అంటూ సిఎం కెసిఆర్ ప్రకటించడం పట్ల విపక్షాలు మండిపడుతున్నాయి.

 

కేవలం 4 సర్వేనెంబర్లలోని భూమిపైన మాత్రమే విచారణ జరిపారని, మరో రెండు సర్వేనెంబర్లలో ఉన్న భూముల జోలికి సర్కారు ఎందుకు పోలేదని ప్రతిపక్ష టిడిపి కచ్చితమైన ఆధారాలు ఇస్తూ విమర్శల వర్షం గుప్పిస్తోంది. ఈ భూముల కుంభకోణంలో సిఎం కెసిఆర్ కుటుంబసభ్యుల పాత్ర కూడా ఉందన్న విమర్శలను బలంగా చేస్తున్నాయి విపక్షాలు.

 

ఈ నేపథ్యంలో మంత్రి కెటిఆర్ ట్విట్టర్ లో జర్నలిజం వృత్తిపై విరుచుకుపడ్డారు. జర్నలిజం విలువలు పతనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో భూముల కుంభకోణంపై తరచుగా పత్రికలు కథనాలు ప్రచురించడాన్ని కెటిఆర్ తప్పుపట్టారు. దురుద్దేశంతో ఈ కథనాలు రాస్తున్నారని ఆరోపించారు. స్వార్థ శక్తులు డబ్బులు వెదజల్లి పెయిడ్ వార్తలు రాయించుకుంటున్నాయని మండిపడ్డారు.  ఇలాంటివి ఎన్ని వార్తలొచ్చినా ఏమీ కాదని ఘాటుగా స్పందించారు కెటిఆర్. 

Follow Us:
Download App:
  • android
  • ios