భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతూనే ఉంది. ఇప్పటికే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు నందీశ్వర్ గౌడ్ స్పష్టం చేసి 24 గంటలు గడవకముందే మరో నేత రాజీనామా బాటపట్టారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కోనేరు చిన్ని తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 18న బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీలో సరైన ప్రాధాన్యం లేకపోవడంతోనే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు.  

దివంగత సీఎం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు తమ  కుటుంబం ఆ పార్టీలోనే ఉందన్నారు. ఆనాడు ఎన్టీఆర్ ఆశయాలు నచ్చి తన తండ్రి కోనేరు నాగేశ్వరరావు టీడీపీలో చేరారని చెప్పుకొచ్చారు.  

తమకు సీటు ఇవ్వకపోయినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలో కార్యకర్తలకు అండగా ఉంటూ పనులు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే గెలిచే పరిస్థితి ఉన్నప్పుడు అధిష్టానం తమకు టిక్కెట్ ఇవ్వలేదని, గెలవలేనప్పుడు అంటే 2009లో సీటు ఇచ్చారని, అదే 2014లో తాను గెలుస్తానని అన్ని సర్వేలు చెప్పినప్పటికీ టిక్కెట్ ఇవ్వకపోవడం తనకు చాలా బాధకలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లే తాను పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు. 
 
ఈ సందర్భంగా అధికార టీఆర్ఎస్ పార్టీపై కోనేరు చిన్ని నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్‌లో కుటుంబపాలన, అవినీతి పాలన నడుస్తుందని విమర్శించారు. తెలంగాణ వస్తే మన హక్కులు పొందుతామని ఆశిస్తే అవి టీఆర్ఎస్ ప్రభుత్వం జరగనివ్వడం లేదని విరుచుకుపడ్డారు.  

మరోవైపు దేశంలో కాంగ్రెస్ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుందన్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం రాహుల్ గాంధే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారని, కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదన్నారు.  

టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ ఒక్క బీజేపీయేనని స్పష్టం చేశారు. మోదీ, అమిత్ షా నాయకత్వంలో బీజేపీలో చేరాలంటూ కార్యకర్తలు ఒత్తిడి తెస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో బీజేపీకి మంచి స్పందన ఉందన్నారు. ఈనెల 18న బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా ఆధ్వర్యంలో బీజేపీ కండువాకప్పుకోనున్నట్లు కోనేరు చిన్ని తెలిపారు. 

ఈ వార్తలు కూడా చదవండి

బిజెపిలో చేరికలు: తెలంగాణలో టీడీపీ ఖతమ్

బాబుకు షాక్: బీజేపీలోకి నందీశ్వర్ గౌడ్

టీఆర్ఎస్ పిలువలేదు, బీజేపీలో చేరుతున్నా:మోత్కుపల్లి
కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌ల భేటీ: బీజేపీలోకి మోత్కుపల్లి నర్సింహులు
అమిత్ షా తెలంగాణ టూర్: బీజేపీలోకి టీడీపీ నేతలు