Asianet News TeluguAsianet News Telugu

బిజెపిలో చేరికలు: తెలంగాణలో టీడీపీ ఖతమ్

2014 ఎన్నికల తరువాత తెలంగాణ టీడీపీ ఆఫీస్ దాదాపుగా ఖాళీ అయ్యింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం వల్ల లాభం జరగకపోగా తీవ్ర నష్టం వాటిల్లింది. దీనితో తెలంగాణ టీడీపీ నాయకులకు ఒక విషయం మాత్రం  అర్థమయ్యింది.

Telangana TDP leaders mau jump into BJP
Author
Hyderabad, First Published Aug 12, 2019, 11:20 AM IST

తెలంగాణలో సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చామని చెప్పుకునే టీడీపీ పార్టీ ఇప్పుడు దాదాపుగా కనుమరుగయ్యింది . అప్పుడో ఇప్పుడో రావుల చంద్రశేఖర్, రమణవంటి వారు పెట్టే ప్రెస్ మీట్లు తప్పితే పెద్దగా చెప్పుకోదగ్గ విషయాలు ఏమి ఉండట్లేదు. 2014 ఎన్నికల తరువాత తెలంగాణ టీడీపీ ఆఫీస్ దాదాపుగా ఖాళీ అయ్యింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం వల్ల లాభం జరగకపోగా తీవ్ర నష్టం వాటిల్లింది. దీనితో తెలంగాణ టీడీపీ నాయకులకు ఒక విషయం మాత్రం  అర్థమయ్యింది. టీడీపీకి తెలంగాణాలో నూకలు చెల్లినట్టే అనే వాస్తవ సత్యం. 

దీనితో వారు తమ భవిష్యత్తు కార్యాచరణపైన దృష్టి సారించారు. తెలంగాణ టీడీపీ అనే ఇంకో శాఖను ఏర్పాటు చేద్దామన్నా ప్రజల్లో టీడీపీ అంటేనే తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీ అనే సెంటిమెంటు నెలకొని ఉంది. ఈ డోలాయమాన పరిస్థితుల్లోఉన్న తెలంగాణ టీడీపీ నేతలకు ఏపీలో జరిగిన 2019 అసెంబ్లీ ఎన్నికలు గట్టి షాక్ ఇచ్చాయి. ఏపీ లో కూడా టీడీపీ అధికారం కోల్పోయింది. గత దఫాలోనన్న టీడీపీ అవతలి రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో ఇక్కడి నాయకులు అక్కడ కనీసం కాంట్రాక్టులైనా  చేసుకుంటూ, టీటీడీ వంటి వాటిలో ఏదో ఒక నామినేటెడ్ పోస్టులతో కాలక్షేపం చేసేవారు. 

ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇక్కడ తెరాస అసలు ప్రతిపక్షం అనేదే లేకుండా చేయడానికి ప్రయత్నిస్తుండడం, ఆంధ్రప్రదేశ్ లో కూడా టీడీపీ అధికారాన్ని కోల్పోవడంతో ఇక్కడి టీడీపీ నాయకుల పరిస్థితి అంధకారంలో పడిపోయింది. తెరాస లో చేరడానికి మిగిలి ఉన్న నాయకులు సంశయిస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు. టీడీపీ నుంచి తెరాస లోకి వెళ్లిన నేతల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు తప్ప వేరేవారెవరూ కూడా  మంత్రి పదవుల్లో లేరు. మంత్రి పదవులు అటుంచండి కనీస గౌరవం కూడా దక్కడంలేదు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలుమార్లు మంత్రిగా పనిచేసి టీడీపీలో అగ్రనాయకుడిగా చలామణి అయిన  కడియం శ్రీహరికి పోటీ చేయడానికి కనీసం టికెట్ కూడా ఇవ్వకుండా పక్కన పెట్టింది తెరాస. పోనీ,  తెరాస వద్దు కాంగ్రెస్ లోకి పోదాము అనుకున్నా, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితులు వారిని వెనకడుగు వేసేలా చేస్తున్నాయి. కేంద్రంలో అధికారాన్ని కోల్పోవడం, పార్టీలో ఏర్పడ్డ నాయకత్వ శూన్యంతో ఆ పార్టీ నేతలే తలలు పట్టుకుంటున్నారు.

 ఈ పరిస్థితుల్లో టీడీపీ వారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి అంతగా  ఆసక్తి చూపడం లేదు. అంతే కాకుండా, స్థానిక నియోజకవర్గాల్లో కాంగ్రెసులోనే బలమైన  నేతలు ఉన్నారు.  ఉదాహరణకు జగిత్యాల నియోజకవర్గం తీసుకుంటే, జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి అక్కడ బలమైన నాయకుడు. ఇప్పుడు ఎల్.రమణ కాంగ్రెస్ లోకి వెళ్లినా అక్కడ జీవన్ రెడ్డిని కాదు అని టికెట్ దక్కుతుందన్న గ్యారెంటీ లేదు. ఈ పరిస్థితుల దృష్ట్యా టీడీపీ నేతలు కాంగ్రెస్ పార్టీవైపు కన్నెత్తి  కూడా చూడడం లేదు. 

కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఉంటే, బీజేపీ ఏమో దూసుకుపోతుంది. జాతీయ స్థాయిలో 300పైచిలుకు సీట్లతో రెండోసారి అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం ఆర్టికల్ 370 రద్దుతో బీజేపీ సానుకూల పవనాలు దేశమంతా వీస్తూఉండడం, అమిత్ షా, మోడీల బలమైన నాయకత్వము, ఇవన్నీ వెరసి బీజేపీ చాలా బలంగా కనపడుతుంది. దీనితో తెలంగాణ టీడీపీ నాయకుల చూపు బీజేపీ వైపు మరలుతుంది. బీజేపీ సైతం క్షేత్ర స్థాయిలో బలమున్న రెడీమేడ్ నాయకులను పార్టీలోకి తీసుకోడానికి ఆసక్తి కనబరుస్తుంది.  అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గ్రాఫ్ బాగా పెరిగింది. 

వీటికితోడు కాంగ్రెస్ ను ఖాళీ చేయాలని తెరాస చేస్తున్న ముమ్మర ప్రయత్నాలతో బీజేపీ అయాచిత లాభం పొందుతుంది. కాంగ్రెస్ క్రమేపీ తన ప్రాభవాన్ని కోల్పోతూ ఉండడంతో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతుంది. అమిత్ షా కేంద్ర హోమ్ మంత్రిగా ఉన్నా తెలంగాణలో మాత్రం దాదాపుగా నెలకు ఒక్కసారన్నా వస్తూ ఇక్కడి నేతల్లో, కార్యకర్తల్లో నయా జోష్ నింపుతున్నారు. 2023లో అధికారం మాదే అంటూ పదే పదే చెబుతూ బీజేపీ ఏదో ఒకవిధంగా  ప్రజల నోళ్ళలో నానే ప్రయత్నాన్ని మాత్రం గట్టిగా చేస్తుంది. . 

ఎంఐఎం తో తెరాస దోస్తీని తమకు అనుకూలంగా బీజేపీ మార్చుకుంటూ ఉండడం, హిందుత్వ భావజాలంతో ప్రజలను ఏకంచేస్తూ ఉండడం బీజేపీకి తెలంగాణాలో అనుకూల అంశాలు. రానున్న సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా జరిపి తెలంగాణాలో తెరాస ఎంఐఎం దోస్తీని మరింత ఎండగట్టాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసమే అమిత్ షా ఆ రోజున కూడా తెలంగాణలో పర్యటించనున్నారు. దీనివల్ల తెలంగాణ సెంటిమెంటును తమకు అనుకూలంగా వాడుకోవాలని బీజేపీ ముమ్మర కసరత్తులు చేస్తోంది.అంతే కాకుండా వచ్చే 2023నాటికి కెసిఆర్ ప్రభుత్వము 10ఏళ్ళు పూర్తిచేసుకుంటుంది. సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత 2019కన్నా ఎక్కువగానే ఉండే ఆస్కారం ఉంది. 

వస్తున్న సమాచారం మేరకు ఆగష్టు 18న అమిత్ షా తెలంగాణాలో పర్యటించనున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. మోత్కుపల్లి నరసింహులు, గరికపాటి వంటి నేతలు ఆరోజు చేరనున్నారు. ఈ విషయాలు తెలుసుకున్న మిగిలిన టీడీపీ నాయకులు కూడా సైకిల్ దిగి కమలదళంలోకి వెళ్లేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.  మొత్తానికి తెలుగు తమ్ముళ్లు లెక్కలు బాగానే వేసుకుంటున్నట్టు కనపడుతున్నారు. 

 

సంబంధిత వార్తలు

బాబుకు షాక్: బీజేపీలోకి నందీశ్వర్ గౌడ్

టీఆర్ఎస్ పిలువలేదు, బీజేపీలో చేరుతున్నా:మోత్కుపల్లి
కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌ల భేటీ: బీజేపీలోకి మోత్కుపల్లి నర్సింహులు
అమిత్ షా తెలంగాణ టూర్: బీజేపీలోకి టీడీపీ నేతలు

Follow Us:
Download App:
  • android
  • ios