తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి అధికారం పోగానే ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ లు జైలుకు పోవడం ఖాయమని  సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వారి ఆస్తులపై విచారణ జరిపించి, కేసులను పెడతామని హెచ్చరించారు. ఇప్పుడు వీరిద్దరికీ అధికారం పోతుందనే భయం పట్టుకుందని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవితలు తెలంగాణ వచ్చినప్పటి నుంచి రూ. 10 వేల కోట్లను దోచుకున్నారని ఆరోపించారు.

మిషన్ భగీరథ, పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇచ్చి, 10 శాతం కమిషన్లు తీసుకున్నారని విమర్శించారు. రూ. 500 కోట్లతో  పూర్తయ్యే ఫైబర్ కేబుల్ వైరుకు కేటీఆర్ బావమరిది పేరుతో కాంట్రాక్టు ఇప్పించి, రూ. 5 వేల కోట్లను దోచుకున్నారని అన్నారు. మియాపూర్, జీడిమెట్ల భూకుంభకోణాలను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఆధారాలతో సహా బయటపెడతామని కోమటిరెడ్డి తెలిపారు.

కేసీఆర్ పై గతంలో నకిలీ నోట్ల కేసు, దొంగ పాస్ పోర్టుల కేసులున్నాయని... బ్లాక్ టికెట్లను అమ్ముకున్న చరిత్ర ఆయనదని కోమటిరెడ్డి విమర్శించారు. మోదీ, రాహుల్ గాంధీలను కేసీఆర్ నోటికొచ్చినట్టు దూషిస్తుంటే..జానారెడ్డిని కేటీఆర్ వచ్చి జానారెడ్డిని  విమర్శించటాన్ని తప్పుపట్టారు.