Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో కాంగ్రెస్ కి షాక్, బీజేపీలోకి కోమటిరెడ్డి బ్రదర్స్..?

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉన్నారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న నేతల్లో ఒకరు. ఇలాంటి తరుణంలో వారు పార్టీ వీడితే కాంగ్రెస్ నిజంగానే కోలుకోలేని పరిస్థితికి చేరే అవకాశం లేకపోలేదు. 

komatireddy brothers may be join bjp
Author
Hyderabad, First Published Jun 15, 2019, 9:09 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వెంటిలేటర్ పై ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇచ్చిన నేపథ్యంలో మరికొందరు అదే దారిలో పయనిస్తున్నారంటూ వార్తలు వినబడుతున్నాయి. 

తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు సాధించి మంచి ఉత్సాహంగా ఉన్న బీజేపీ పట్టుకోసం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది బీజేపీ. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా కాంగ్రెస్, టీడీపీ నేతలకు గాలం వేస్తోంది బీజేపీ. అందులో భాగంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. 

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన రామ్ మాధవ్ ను కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు, తటస్థంగా ఉన్న నేతలు, టీడీపీ నేతలు కలిశారు. బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. 
 
ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీలు, ఎమ్మెల్యే ఒకరు బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అనంతరం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్ రామ్ మాధవ్ తో చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. 

ప్రస్తుతం నల్గొండ జిల్లాలో మిగిలిన ఏకైక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇకపోతే ఇటీవలే లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి లోక్ సభనియోజకవర్గం నుంచి గెలుపొందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు బీజేపీలో చేరతారంటూ అందులో భాగంగానే రామ్ మాధవ్ తో భేటీ అయ్యారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 

కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీ అగ్రనేత రామ్ మాధవ్ ను కలిసిన వార్తలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. తాము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామని ఎట్టిపరిస్థితుల్లో బీజేపీలో చేరబోమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతోపాటు అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. 

దీంతో బీజేపీలోకి కోమటిరెడ్డి బ్రదర్స్ చేరతారంటూ వస్తున్న వార్తలకు కాస్త ఫుల్ స్టాప్ పడ్డాయి అనుకున్న తరుణంలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని, ఇప్పట్లో లేచే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. తెలంగాణలో టీడీపీతో పొత్తు కొంపముంచిందని ఆరోపించారు. చంద్రబాబుతో పొత్తుపెట్టుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీని చేజేతులా నాశనం చేశారని ఆరోపించారు. 

అంతేకాదు కాంగ్రెస్ పార్టీ రథసారధులపైనా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమికి రాష్ట్ర నాయకత్వమే కారణమని ఆరోపించారు. 

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియాల ధోరణి వల్లే పార్టీ పరిస్థితి దయనీయంగా మారిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతుంటే అడ్డుకట్ట వేయాల్సింది పోయి చోద్యం చూశారంటూ ధ్వజమెత్తారు.   

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలవ్వడంతో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినా, తెలంగాణలో ఓటమి విషయంలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాత్రం అలా ఆలోచించలేకపోయాడని ఆరోపించారు. 

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీని ఢీకొట్టాలంటే ప్రధాని మోదీలాంటి నేత కావాలని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అందువల్లే కాంగ్రెస్‌ నేతలు భారీ స్థాయిలో బీజేపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

మరోవైపు తాను కాంగ్రెస్‌ పార్టీని వీడే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.  త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం బీజేపీయే టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నయం అని, బీజేపీ అగ్రనేత రామ్ మాధవ్ తో కాంగ్రెస్ పార్టీ నేతలు టచ్ లో ఉన్నారని వారంతా మాట్లాడారంటూ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో కలవరం రేపుతున్నాయి. 

అంతేకాదు గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీ పాగా వేసేందుకు వ్యూహం పన్నుతుందంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతల సమావేశాలు చర్చలను, వ్యూహాలను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టంగా చెప్పడంతో ఇక కోమటిరెడ్డి సోదరులు పార్టీ వీడేందుకు నిర్ణయించుకున్నారా అనే సందేహం నెలకొంది.  

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉన్నారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న నేతల్లో ఒకరు. ఇలాంటి తరుణంలో వారు పార్టీ వీడితే కాంగ్రెస్ నిజంగానే కోలుకోలేని పరిస్థితికి చేరే అవకాశం లేకపోలేదు. 

ఈ వార్తలు కూడా చదవండి

తెలంగాణ కాంగ్రెస్ కి మరో షాక్..బీజేపీలోకి కోమటి రెడ్డి?

తెలంగాణలో కాంగ్రెస్ కు భవిష్యత్ లేదు, త్వరలో బీజేపీ గూటికి కీలక నేతలు : కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Follow Us:
Download App:
  • android
  • ios