హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని తేల్చి చెప్పేశారు. కాంగ్రెస్‌ ఇప్పట్లో లేచేలా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని చెప్పుకొచ్చారు. 2024లోనూ బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని చెప్పుకొచ్చారు. 

తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఇక కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తుపెట్టుకోవడం వల్ల పార్టీకి తీరని అన్యాయం జరిగిందన్నారు. 

తెలంగాణలో టీడీపీతో పొత్తు కొంపముంచిందని ఆరోపించారు. చంద్రబాబుతో పొత్తుపెట్టుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీని చేజేతులా నాశనం చేసుకున్నామని తెలిపారు. తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమికి రాష్ట్ర నాయకత్వమే కారణమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. 

తాను కాంగ్రెస్‌ పార్టీని వీడే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.  త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడినా పట్టించుకునే నాధుడే లేకపోయాడని వాపోయారు. 

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలవ్వడంతో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినా, తెలంగాణలో ఓటమి విషయంలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాత్రం అలా ఆలోచించలేకపోయాడని ఆరోపించారు. 

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీని ఢీకొట్టాలంటే ప్రధాని మోదీలాంటి నేత కావాలని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అందువల్లే కాంగ్రెస్‌ నేతలు భారీ స్థాయిలో బీజేపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

త్వరలో తెలంగాణలో కేంద్రమంత్రి అమిత్‌షా పర్యటించనున్నారు. కాంగ్రెస్‌ నేతలతో ఇప్పటికే ఆ పార్టీ నేత రాంమాధవ్‌ చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరికలకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఇప్పటికే గ్రేటర్‌ హైదరాబాద్‌పై బీజేపీ దృష్టిపెట్టిందని త్వరలో ఇద్దరు కీలక నేతలు బీజేపీ గూటికి చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.