తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుందా...? బీజేపీ ప్రయత్నాలు చూస్తుంటే అవుననే సమాధానం వినపడుతోంది. తెలంగాణ లో ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కాస్త పుంజుకుంది. దీంతో.. స్థానికంగా కూడా బలం పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ ఆకర్ష్ మంత్రాను ఉపయోగిస్తోంది.

బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, టీఆర్ఎస్‌ మాజీ ఎంపీ వివేక్‌, కల్వకుంట్ల రమ్యరావు భేటీ అయ్యారు. బీజేపీలో చేరికపై చర్చలు జరిపినట్లు సమాచారం. కాంగ్రెస్‌ పార్టీ కోలుకునే అవకాశం లేకపోవడంతో పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీరితోపాటు... తెలంగాణ టీడీపీ నేతలను కూడా బీజేపీలో చేర్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

అయితే... ఈ వార్తలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము బీజేపీలో చేరుతున్నామని వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని తేల్చి చెప్పారు. తాను కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటానని, పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే తన లక్ష్యమన్నారు. నిన్న మొత్తం నియోజకవర్గంలోనే పర్యటించినట్లు కోమటిరెడ్డి పేర్కొన్నారు. కావాలనే తనపై దుష‍్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.