కేసిఆర్ సర్కారుపై కోదండరాం వదిలిన కొత్త బాణం 24 గంటల నిరసన దీక్ష ద్వారా సర్కారును ఎండగట్టే యత్నం కొలువులకై కొట్లాట సభకు అనుమతివ్వకపోవడం పట్ల జెఎసి ఆగ్రహం
తెలంగాణలో ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ సరికొత్త పోరాటానికి శ్రీకారం చుట్టారు తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరాం. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం సాగుతున్న ఆందోళనలను తెలంగాణ సర్కారు ఉక్కుపాదంతో అణిచివేస్తోందని ఆయన ఆరోపించారు. కేసిఆర్ సర్కారు అవలంభిస్తున్న నిరంకుశ, నిర్బంధ వైఖరులను నిరసిస్తూ 24 గంటలపాటు నిరసన దీక్షకు దిగిండు కోదండరాం. ఈ దీక్షను తన నివాసంలోనే చేపట్టడంతో రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలవరం మొదలైంది.

తార్నాకలోని తన నివాసంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు దీక్ష ప్రారంభించారు. ఈ దీక్ష రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగనుంది. సర్కారు దుర్మార్గ వైఖరికి నిరసనగానే ఈ నిరసన దీక్ష చేపట్టినట్లు కోదండరాం తెలిపారు. ఈ దీక్ష ద్వారా తెలంగాణ సర్కారు అవలంభిస్తున్న నిర్బంధ విధానాలను, నిరంకుశ పోకడలను ఎండగట్టే ప్రయత్నం చేయాలన్న యోచనలో తెలంగాణ జెఎసి ఉంది.
అయితే కొలువులకై కొట్లాట సభ పేరుతో తెలంగాణ జెఎసి తీవ్రమైన కసరత్తు చేసింది. అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కానీ హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి ఆ సభకు అనుమతి ఇవ్వలేదు. దీనికితోడు ఆ సభ జరిపితే నక్సలైట్లు వచ్చి హైదరాబాద్ లో అలజడి రేపుతారని నాయిని తెలిపారు. జెఎసిలో నక్సలైట్లు ఉన్నారని, వారిని కంట్రోల్ చేయడం కోసమే తెలంగాణ జెఎసి సభలకు అనుమతిస్తలేమని నాయిని ప్రకటించడం పట్ల జెఎసితోపాటు అన్ని రాజకీయ పార్టీలు కూడా భగ్గుమన్నాయి.
ఈ ప్రకటన పట్ల జెఎసి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సర్కారు ఏరకమైన వైఖరి అవలంభించిందో అదేరకమైన వైఖరి తెలంగాణ సర్కారు కూడా అవలంభిస్తోందని జెఎసి మండిపడింది. దీంతో కొలువుల కై కొట్లాట సభకు అనుమతి కోసం కోర్టు తలుపు తట్టింది జెఎసి. కానీ ఈరోజు వరకు కూడా కోర్టునుంచి అనుమతి రాకపోవడంతో జెఎసి ఆందోళన చెందింది. చివరి వరకు కొలువులకై కొట్లాట సభ జరుగుతుందా లేదా అన్న మీమాంసలో జెఎసి ప్రతినిధులు ఉండిపోయారు. అయితే జిల్లాల నుంచి జెఎసి శ్రేణులు సైతం కోర్టు అనుమతి కోసం ఎదురుచూడక తప్పని పరిస్థితి నెలకొంది. తుదకు కొలువులకై కొట్లాట సభను రద్దు చేసుకున్న జెఎసి దీక్షకు దిగి సంచలనం సృస్టించింది.
అయితే అయినప్పటికీ తెలంగాణ సర్కారు ఇంతటి పాశవిక చర్యలకు పాల్పడడం సరికాదని జెఎసి అంటున్నది. ఇప్పటికే జెఎసి జరపతలపెట్టిన స్పూర్తి యాత్రకు సైతం అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తున్నది సర్కారు. దీంతో అన్ని అంశాలలో సర్కారు వైఖరిని ఎండగట్టే ఉద్దేశంతోనే జెఎసి ఛైర్మన్ కోదండరా 24 గంటల నిరసన దీక్షకు దిగినట్లు జెఎసి నేతలు తెలిపారు. జెఎసి ఛైర్మన్ కోదండరాం చేపట్టిన నిరసన దీక్షకు పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజా సంఘాల వారు , విద్యార్థులు మద్దతు పలికారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
