నవంబరు 30 కొలువుల కొట్లాట సభ డిసెంబరు 9,10 తేదీల్లో నల్లగొండ స్పూర్తి యాత్ర టిఆర్ఎస్ విమర్శలపై ఘాటుగా స్పందించిన కోదండరాం
నవంబరు 30వ తేదీన కొలువులకై కొట్లాట సభను జరపాలని తెలంగాణ జెఎసి నిర్ణయించింది. అలగే డిసెంబరు 9,10 తేదీల్లో నల్లగొండ జిల్లాలో అమరుల స్పూర్తి యాత్రను చేపట్టాలని నిర్ణయించింది. హైదరాబాద్ నాంపల్లిలోని జెఎసి కార్యాలయంలో జరిగిన జెఎసి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశం వివరాలను ఛైర్మన్ కోదండరాం మీడియాకు వివరించారు. ఆ వివరాలు చదవండి.
‘‘అడ్డగోలు సంపాదనల కోసం అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారు. అధికారాన్ని వాడుకుని అడ్డగోలుగా సంపాయించడం మాకు చేతగాదు. అలాంటి రాజకీయాలు, అలాంటి పనులు మేము చేయ్యలేము. ఇంతటి తీవ్రమైన నిరుద్యోగ సమస్యను పక్కనపెట్టి కేవలం మీ స్వార్థం కోసం పాకులాడుతున్నారు. అధికారంలో ఉన్నవాళ్లు తలుచుకుంటే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరుకుతది.’’
నవంబరు 30న హైదరాబాద్ లో కొలువులకై కొట్లాట సభ జరుపుతాం. గతంలో సభ జరుపుకునేందుకు ఎంతో కష్టపడి ప్రచారం చేసినం. ఖర్చు పెట్టుకున్నం. కానీ ప్రభుత్వం అవలంభించిన నిరంకుశ వైఖరి కారణంగా సభను జరుపుకోలేకపోయినం. కోర్టు అనుమతి వచ్చింది కాబట్టి సభ కోసం జెఎసి సభ్యులంతా సిద్ధం కావాలి. 30వ తేదీన సభను విజయవంతం చేయాలి.
డిసెంబరు 9,10 నల్లగొండలో అమరుల స్పూర్తి జరపాలని నిర్ణయించినం. ముందుగా కొలువులకై కొట్లాట సభ ఉంది కాబట్టి దాని నిర్వహణపై దృష్టి పెట్టినం. ధర్నా చౌక్ ను పునరుద్ధరించాలన్నది కూడా మా డిమాండ్లలో ఒకటిగా ఉంది. కొలువులకై కొట్లాట సభ కేవలం బతుకుదెరువు కోసం చేసే పోరాటం కాదు. మార్పు కోసం జరుపుతున్న పోరాటంగా చూడాలి. ఏదో నాలుగు ఉద్యోగాల కోసం చేస్తున్నది కాదు. సమాజ నిర్మాణంలో ఆర్థిక రంగంలో యువతకు భాగస్వామ్యం కల్పించే ఉద్దేశంతో చేస్తున్న పోరాటంగా చూడాలి. ఉద్యోగాలు రాకపోతే చదువుకున్న యువత నిర్వీర్యం అవుతుంది. ఉద్యోగాలు రాకపోతే తల్లిదండ్రుల మాదిరిగానే కూలీ, నాలి చేసుకోవాల్సిన దుస్థితి వస్తది. తెలంగాణ ఉద్యమం జరిగిందే దీనికోసం కదా? అనేక మంది యువతీ యువకులు బలిదానాలు చేసుకున్నారు. వారు రాసిన ఉత్తరాల్లో తెలంగాణ వస్తే ఉద్యోగం వస్తది అని రాసుకున్నారు. అటువంటి తీవ్రమైన విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. నిరుద్యోగ సమస్య పట్ల చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నది.

భవిష్యత్తులో ఎవరినీ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ లో తీసుకోరాదని సూచిచినం. ఉద్యోగ క్యాలెండర్ ఇయ్యాలని అడుగుతున్నం. భూమి పుత్రులకే తెలంగాణలో యువతకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నం. వ్యవసాయ, కుటీర, గృహ పరిశ్రమల్లో బతుకుతెరువు చూపాలని అడుగుతున్నం. చివరగా నిరుద్యోగ భృతి చెల్లించాలని కోరుతున్నం.
బతుకుతెరువు చూపకపోతే యువత పెడమార్గంలో పయనించే ప్రమాదం ఉంది. ఉద్యోగాల కల్పించే విషయంలో ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతున్నది. గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చి సంవత్సరం అయినా ఫలితాలు రాలేదు. టీచర్ పరీక్షల నోటిఫికేషన్ ఎంత గందగోళంగా ఇచ్చిర్రో చూస్తున్నం. గ్రూప్ 1 ఫలితాలు ఇచ్చినా మళ్లీ గందరోగళం ఏర్పడి పెండింగ్ లో పెట్టిర్రు. మళ్లీ సమీక్ష చేస్తున్నారు.
సుప్రీంకోర్టు పదే పదే ఆదేశాలిస్తున్నది. సమాన పనికి సమాన వేతనం.. ఈ విషయంలో ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. హోంగార్డుల విషయంలో స్పష్టమైన ఆర్డర్ ఇచ్చింది. అయినా ఆచరణకు నోచుకోలేదు. వ్యవసాయంలో బతుకుదెరువు చూపడానికి సర్కారు చేపట్టిన చర్యలు శూన్యం. భవిష్యత్తు అంతా యువతదే. అలాంటి యువతను సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలి.
ప్రభుత్వ నిరంకుశ ధోరణితోనే గత నెలలో కొలువులకై కొట్లాట సభ పెట్టుకోలేకపోయినం. అయినా కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాం. ఈ సమస్యపై మరింత గట్టిగా పోరాటం చేద్దాం. ఈ సభకు అందరూ భాగస్వామ్యం కావాలి. మనం జాతరకు పోతే ఆ జాతర ఎవరిదో అని అనుకోం. సమ్మక్క జాతరకు పోతే మనదే అనుకుంటం. అట్లా నిరుద్యోగ సభలో అన్ని వర్గాల వారు భాగస్వామ్యం కావాలి.
మెట్రోరైల్ లో ఉద్యోగాలు ఎవరికి ఇస్తున్నారు? ఆ ఉద్యోగాలన్నీ కూడా స్థానికులకు ఇవ్వాలి. మెట్రోలోని షాపింగ్ కాంప్లెక్స్ లలో ఉద్యోగాలు కూడా తెలంగాణ వారికే ఇవ్వాలి.
కొలువులకై కొట్లాట సభ కోసం అందరిని కలుస్తాం. అందరి సహకారం కోరతాం. ఈ సభను ప్రతి ఒక్కరు గట్టిగా పట్టి విజయవంతం చేస్తేనే తెలంగాణలో నిరుద్యోగ సమస్యను మరోసారి ఎజెండా మీదకు తీసుకురాగలం. నవంబరు 30 చాలా రోజులు ఉంది కదా అని ఆగొద్దు. ఇప్పటినుంచే అందరూ ప్రచారం చేయాలి. ఎవరిని అడిగినా.. నవంబరు 30 ఎక్కడుంటావంటే.. కొలువుల కొట్లాట సభలో ఉంటామని చెప్పాలి. 30వ తేదీన మాత్రం క్యాలెండర్ లో సభ విజయవంతం చేయాలని రాసిపెట్టుకోవాలి.
30న సేఫ్ ద డేట్ అని రాసిపెట్టుకోండి. ఈ సభకు విజయవంతం చేయాలని అందరినీ కోరుతాము. సరూర్ నగర్ లోని స్పోర్ట్స్ గ్రౌండ్ లో పర్మిషన్ ఇస్తామని పోలీసులు అన్నారు. దానికి మేము కూడా అనుమతి కోసం దరఖాస్తు చేస్తాము. పోలీసులు అనుమతి ఇవ్వగానే టైమింగ్స్ కూడా చెప్తాము.
రాజకీయ పార్టీ ఏర్పాటుపై మీడియా ప్రశ్నలకు....
చాలా మంది జెఎసిలో, జెఎసి వెలుపల కూడా రెండు సంవత్సరాలుగా వత్తిడి చేస్తున్నారు. రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. రాజకీయాలు అంటే స్వార్థం కోసం అన్నట్లుగా భావన ఏర్పడింది. భవిష్యత్తులో రాజకీయాలు మారాలి. సమాజహితం కోసం రాజకీయాలు మారాలి. మేము కూడా గుర్తించినం.తెలంగాణ అభివృద్ధి జరగాలంటే రాజకీయాలు మారాలి.
ప్రత్యామ్నాయ రాజకీయాలు రావాలని పిలుపునిచ్చినం. కానీ మా స్పందన విషయంలో చాలా మంది సంతృప్తి చెందలేదు. మామీద మళ్లీ వత్తిడి తెస్తున్నారు. ఆ వత్తిడి మేరకు జెఎసిలో చర్చ మాత్రమే జరుగుతున్నది. నిర్ణయమైతే ఇంకా జరగలేదు. కానీ.. ప్రత్యామ్నాయ వేదిక రావాలనే విసయంలో జెఎసి నిర్ణయం తీసుకుంటది. రాజకీయ వేదికల మీద కూర్చొని రాజకీయాలు చేస్తున్నారంటూ మాట్లాడడం దురదృష్టకరం. ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం, స్వార్థ రాజకీయాలకు వ్యతిరేంగా జెఎసి కచ్చితంగా ముందుకొస్తది. పార్టీపై ఇంకా నిర్ణయం మాత్రం తీసుకోలేదు.
