అమెరికా పర్యటన ముగించుకుని తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరాం ఇలా విమానం దిగిండో లేదో నిమిషం ఆగకుండా అలా కేసిఆర్ కు పొగ పెట్టిండు. కీలెరిగి వాత పెట్టిండు అన్న సామెత ప్రకారంగా.. ఎక్కడ పొగ పెడితే సర్కారుకు సురుకు తలుగుతదో అక్కడే గట్టిగా మల్లా పొగ పెట్టిండు కోదండరాం. ఇంతకూ పొగ పెట్టిన ముచ్చటేందబ్బా అనుకుంటున్నరా.? చదవండి మరి.

తెలంగాణ జెఎసి ఛైర్మన్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం అమెరికాలో పర్యటించారు. అక్కడ తెలంగాణ ఎన్నారైలతో కలుసుకున్నారు. తమ పార్టీ ఏర్పాటు, తెలంగాణలో సర్కారు పనితీరు ఇలాంటి అనేక అంశాలపై వారితో చర్చించారు. ఇక అమెరికా నుంచి రాగానే మళ్లీ ప్రజా సమస్యలు అంటూ రోడ్ల మీద పడ్డడు. అమెరికా పోకముందే ఆయన తెలంగాణ నిరుద్యోగ సమస్యపై సర్కారును మరోసారి కదిలించే ప్రయత్నం చేశారు. జనవరి 22, 23 తేదీల్లో నిరుద్యోగ సమస్యపై తెలంగాణ సర్కారులో చలనం కలిగించేందుకు పోస్టు కార్డు ఉద్యమం చేపట్టారు. దాదాపుగా 2లక్షల 20వేల పోస్టు కార్డులు సిఎంకు రాశారు నిరుద్యోగులు.

శుక్రవారం నిరుద్యోగ సమస్యపై కోదండరాం స్వయంగా తాను సిఎం కేసిఆర్ కు ఒక పోస్టు కార్డు రాశారు. ఆ పోస్టు కార్డును ఇవాళ ఎర్రమంజిల్ సమీపంలో ఉన్న పోస్టు బాక్స్ లో వేశారు. ఇప్పటికైనా నిరుద్యోగ సమస్యపై తెలంగాణ సిఎం కేసిఆర్ దృష్టి సారిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ అయినా నిరుద్యోగులను పట్టించుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

ఇక పోస్టుకార్డు పోస్టు చేయకముందు కోదండరాం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోదండరాం మాట్లాడారు. జనవరి 22, 23న జెఎసి ఆధ్వర్యంలో పోస్టు కార్డు ఉద్యమం విజయవంతమైందన్నారు. మా కొలువులు మాకు కావాలి అన్న అంశంగా ఉద్యమం సాగింది. కానీ సర్కారు యువతను ఎందుకు నిర్లక్ష్యం చేసిందని ఒక విద్యార్థి తన అభిప్రాయాన్ని రాసిండన్నారు. కొలువుల భర్తీ చేయకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని ఇంకో విద్యార్థి రాశారన్నారు. మీరు ప్రగతిభవన్ లో ఉన్నారు. మేము ఉద్యోగాలు లేక బాధలో ఉన్నాము అని యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జెఎసి పెట్టిన 5 డిమాండ్లు ఇవే.

1 తక్షణమే ఖాళీలను భర్తీ చేయాలి.

2 ఖాళీల కుదింపు ప్రక్రియ నిలిపివేయాలి.

3 క్యాలెండర్ విడుదల చేయాలి.

4 స్థానికులకే స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇవ్వాలి.

5 నిరుద్యోగ భృతి ఇవ్వాలి.

ఫిబ్రవరి 22 నుంచి ఏడాది కాలం పాటు నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఏడాది పొడవునా ఈ కార్యక్రమం సాగిందని కోదండరాం చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిస్తదని మేము ఆశిస్తున్నామన్నారు. ఒకవేళ సర్కారు స్పందించకపోతే తీవ్రంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం.

మొత్తానికి నిరుద్యోగ సమస్య సర్కారు మరచిపోదామనుకున్నా.. కోదండరాం మరచిపోనిచ్చేలా లేడు కదా అని నిరుద్యోగులు అంటున్నారు. ప్రెస్ మీట్ లో కోదండరాం మాట్లాడిన వీడియో కింద ఉంది చూడొచ్చు.