75 ఏళ్లుగా త్యాగాల చరిత్రను తొక్కిపెట్టారు.. ఇది ఏ రకంగా సమైక్య దినం అవుతుంది?: కిషన్ రెడ్డి
తెలంగాణ విమోచన పోరాటం అద్భుతమైనదని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు.

తెలంగాణ విమోచన పోరాటం అద్భుతమైనదని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణకు 13 నెలలు ఆలస్యంగా స్వాతంత్య్రం వచ్చిందని చెప్పారు. ఆనాటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో తెలంగాణ గడ్డపై భారత జాతీయ జెండా ఎగరేలా చేశారని అన్నారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న హైదరాబాద్ విమోచన దినోత్సవంకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈరోజు ఉదయం పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకున్న అమిత్ షా.. తొలుత వార్ మెమోరియల్ వద్ద నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. తర్వాత కేంద్ర బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకు వచ్చింది ప్రత్యేకమైన స్వాతంత్య్రం అని అన్నారు. లక్షలాది మంది పోరాటం చేశారని.. వేలాది మంది బలిదానం అయ్యారని.. భారత సైన్యం కూడా నిజాం రజాకార్లపై పోరాటం చేసి స్వేచ్ఛ స్వాతంత్ర్యం అందించిందని చెప్పారు. నిజాం రజాకార్లు అరాచకాలకు పాల్పడ్డారని.. మహిళల చేత నగ్నంగా బతుకమ్మలు ఆడించారని అన్నారు. వేలాది మందిని రజాకార్లు హత్యలు చేశారని అన్నారు. అలాంటి రజాకర్ల నుంచి రక్షించడానికి పల్లెల్లకు పల్లెలు ఉద్యమించాయని చెప్పారు. నిజాం రజాకార్లను భారత సైన్యం ఓడించిందని చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో తెలంగాణ గడ్డపై భారత జాతీయ జెండా ఎగరేలా చేశారని అన్నారు.
Also Read: పరేడ్ గ్రౌండ్‌లో విమోచన ఉత్సవాల్లో అమిత్ షా.. వార్ మెమోరియల్ వద్ద నివాళులు, జాతీయ జెండా ఆవిష్కరణ..
అయితే ఇది అద్భుతమైన పోరాటమని.. 75 ఏళ్లుగా ఈ పోరాటాన్ని ఎవరూ గుర్తించలేదని అన్నారు. 75 ఏళ్లుగా ఏ ప్రభుత్వం కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించలేదని.. త్యాగాల చరిత్రను తొక్కిపెట్టారని విమర్శించారు. ఈరోజు కూడా భావితరాలకు చరిత్ర తెలియకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ఏ రకంగా సమైక్య దినం అవుతుందని ప్రశ్నించారు. బానిస సంకెళ్ల నుంచి విముక్తి కోసం.. తుపాకీ తుటాలకు ఎదురొడ్డి చేసిన పోరాటం గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. పోరాట యోధులకు సెల్యూట్ చేస్తున్నట్టుగా పేర్కొన్నారు.