ప్రధాని మోదీ తెలంగాణపర్యటనను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు బహిష్కరించారో సమాధానం చెప్పాలని టీ బీజేపీ నూతన అధ్యక్షుడు, కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

ప్రధాని మోదీ తెలంగాణపర్యటనను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు బహిష్కరించారో సమాధానం చెప్పాలని టీ బీజేపీ నూతన అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో ముందుగా బహిష్కరించాల్సింది కల్వకుంట్ల కుటుంబాన్నేనని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు కల్వకుంట్ల కుటుంబాన్ని ఫామ్‌హౌజ్‌కే పరిమితం చేస్తారని చెప్పుకొచ్చారు. ఈరోజు వరంగల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. తెలంగాణలో రూ. 6,100 కోట్ల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. 

ఈ వేదికపై నుంచి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌తో లక్షలాది మంది నిరుద్యోగాల జీవితాల్లో నిప్పులు పోశారని కేసీఆర్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి కాదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ పనిచేస్తుందని తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల డీఎన్ఏ ఒక్కటే అని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీకి తొత్తులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎంఐఎం మతతత్వాన్ని పెంచి పోషిస్తోందని ఆరోపించారు. 

Also Read: తెలంగాణ అభివృద్ది కోసం కేంద్రం అంకిత భావంతో పనిచేస్తోంది.. కిషన్ రెడ్డి

గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ కలిసి పనిచేశాయని అన్నారు. ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ఓటు వేసినా, బీఆర్ఎస్‌కు ఓటు వేసినా ఒక్కటేనని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. మోదీ ప్రభుత్వం అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తుందని చెప్పారు. తెలంగాణ బీజేపీని అధికారంలోకి రావడమే లక్ష్యంగా అందరం కలిసి కట్టుగా పనిచేస్తామని చెప్పారు. తప్పకుండా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.