వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని పాతరేస్తామన్నారు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. కల్వకుంట్ల ఫ్యామిలీని ఫాంహౌస్‌కే పరిమితం చేయాలన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్లేనని.. ఈ రెండు పార్టీలు ఒకే నాణేనికి బొమ్మాబొరుసులాంటివన్నారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్‌లో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిజాం తరహా పాలన నడుస్తోందని మండిపడ్డారు. కుటుంబ పాలన, అవినీతి నిర్మూలనే లక్ష్యంగా బీజేపీ పోరాటం సాగిస్తోందన్నారు. రెండు విషయాల్లో మోడీ స్వయంగా ఎర్రకోట నుంచి స్పష్టమైన లక్ష్యాన్ని భారతీయుల ముందు పెట్టారని కిషన్ రెడ్డి తెలిపారు. 

ఎన్నో పోరాటాలు, అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బందీ అయిపోయిందన్నారు. నిరంకుశ పాలనకు పాతరేస్తామని.. కల్వకుంట్ల కుటుంబాన్ని ఫాంహౌస్‌కు పరిమితం చేయాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. దళితులకు వెన్నుపోటు పొడిచి కేసీఆర్ సీఎం పీఠం ఎక్కారని ఆయన దుయ్యబట్టారు. గిరిజన బంధు, రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామన్నారని ఆ హామీలు ఏమయ్యాయని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పార్టీ కార్యాలయాలకు భూములు ఇస్తున్నారని.. అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రం ఇవ్వడం లేదని మండిపడ్డారు.

Also Read: ఢిల్లీ పెద్దలతో బండి సంజయ్ చర్చలు.. రఘునందన్‌రావు పై యాక్షన్‌?

కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్యే గతంలో పొత్తులు కుదిరాయని.. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారాన్ని పంచుకున్నాయని పేర్కొన్నారు. అలాంటి ఈ రెండు పార్టీలు బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్లేనని.. ఈ రెండు పార్టీలు ఒకే నాణేనికి బొమ్మాబొరుసులాంటివన్నారు. తాము ఏనాడు కాంగ్రెస్, బీఆర్ఎస్‌తో కలవలేదని కిషన్ రెడ్డి గుర్తుచేశారు.

తెలంగాణ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధాని సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బండి సంజయ్ నాయకత్వంలో రెండు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో , జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించామని కిషన్ రెడ్డి గుర్తుచేశారు.