హరీష్ టార్గెట్, కేటిఆర్ కు రస్తా: కేసిఆర్ ప్లాన్ ఇదీ...
కేటి రామారావును ముఖ్యమంత్రిగా చేయాలనే ఉద్దేశంతోనే కేసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని కాంగ్రెసు నాయకులు విమర్శలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తనను పక్కన పెట్టడం వెనక కేటి రామారావు ఉన్నారని కొండా సురేఖ ఇటీవల విమర్శలు చేసిన విషయం కూడా తెలియంది కాదు.
హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో తమ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కుమారుడు, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేత కేటి రామారావు తాజాగా శనివారంనాడు చెప్పారు. కేసిఆర్ జాతీయ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించబోతున్నట్లు ఇటీవల ఓ టీఆర్ఎస్ నేత కూడా చెప్పారు. దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర సమితిలో ఏం జరుగబోతుందనే విషయంపై ఓ అంచనాకు రావచ్చునని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
కేటి రామారావును ముఖ్యమంత్రిగా చేయాలనే ఉద్దేశంతోనే కేసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని కాంగ్రెసు నాయకులు విమర్శలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తనను పక్కన పెట్టడం వెనక కేటి రామారావు ఉన్నారని కొండా సురేఖ ఇటీవల విమర్శలు చేసిన విషయం కూడా తెలియంది కాదు. కేటిఆర్ తనకు అనుకూలమైన గ్రూపును తయారు చేసుకున్నారని కూడా ఆమె అన్నారు.
చెన్నూరులో ఓదేలును కాదని బాల్క సుమన్ కు, ఆందోల్ లో బాబూ మోహన్ ను పక్కన పెట్టి క్రాంతికి టికెట్లు ఇవ్వడం వెనక కూడా తనకు సన్నిహితులైనవారిని కేటిఆర్ ఎంపిక చేసుకోవడంలో భాగంగానే జరిగిందనే అనుమానాలను కొండా సురేఖ వ్యక్తం చేశారు. అయితే చాలా కాలం నుంచి కేటిఆర్ ను తన వారసుడిగా నిలబెట్టే ప్రయత్నాలను కేసిఆర్ కొనసాగిస్తూ వస్తున్నారు.
అప్పట్లో ఓసారి కలెక్టర్ల సమావేశం జరిగినప్పుడు కలెక్టర్లతో కేటిఆర్ గ్రూప్ ఫొటో దిగారు. అప్పుడే కేటిఆర్ ను ముఖ్యమంత్రిగా చేయడానికి రంగం సిద్ధమైనట్లు ప్రచారం జరిగింది. నిజానికి, కలెక్టర్లతో గ్రూపు ఫొటో ముఖ్యమంత్రి దిగడడం ఆనవాయితీ. లేదంటే రెవెన్యూ మంత్రి దిగాలి. అందుకు విరుద్ధంగా కేటిఆర్ వారితో గ్రూపు ఫొటో దిగారు. అయితే, అప్పట్లో కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచనను కేసిఆర్ విరమించుకున్నారని అంటారు. హరీష్ రావు వల్ల తలెత్తే ప్రమాదాన్ని ఊహించే ఆయన ఆ ఆలోచనను విరమించుకున్నట్లు చెబుతున్నారు.
అయితే, హరీష్ రావు ప్రాబల్యాన్ని క్రమంగా తగ్గించే విధంగానే కేసిఆర్ వ్యవహరిస్తూ వస్తున్నారు. హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల బాధ్యతను కేటి రామారావుకు అప్పగించారు. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల బాధ్యతను కూతురు కవితకు అప్పగించారు. ఈ రెండింటిలోనూ టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. హైదరాబాదు నగర పాలక సంస్థ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ద్వారా కేసిఆర్ వారసుడు కేటిఆరేననే ప్రచారం ఊపందుకుంది. అందుకు తగినట్లుగానే పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కేటిఆర్ కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రిగా కేసిఆర్ చేయాల్సిన పనులను కూడా కేటిఆర్ చేస్తూ వస్తున్నారు. ఇటీవలి టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ బాధ్యతలు కూడా పూర్తిగా కేటిఆర్ చూసుకున్నారు.
అయితే, హరీష్ రావును పక్కకు తప్పిస్తే తప్ప కేటిఆర్ కు పూర్తి స్థాయిలో మార్గం ఏర్పడదనే ఉద్దేశంతోనే కేసిఆర్ ఇప్పటికీ ఉన్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే సంతోష్ ను ముందుకు తెచ్చి హరీష్ రావు స్థానాన్ని మరింతగా తగ్గించే ఎత్తుగడను కేసిఆర్ వేశారని అంటారు.
ముందస్తు ఎన్నికల వ్యూహం కూడా కేటిఆర్ కోసమేననే అభిప్రాయానికి బలం చేకూరుతూ వస్తోంది. సిద్ధిపేట నుంచి హరీష్ రావు అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పటికీ సమయానికి ఆయనను ఎన్నికల బరి నుంచి తప్పించే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. హరీష్ రావుకు అనుకూలంగా ఉన్నారని భావిస్తూ వస్తున్న వారందరినీ పోటీ నుంచి తప్పించినా ఆశ్చర్యం లేదనే వాదన తాజాగా వినిపిస్తోంది. అందుకే, కేసిఆర్ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల్లో ఎంత మందికి బీ ఫారాలు ఇస్తారో చెప్పాలని కొండా సురేఖ డిమాండ్ చేశారు. అదే మాట తాజాగా శనివారంనాడు బిజెపి నేత రఘునందరావు అన్నారు.
హరీష్ రావును పక్కకు తప్పించి కేసిఆర్ సిద్ధిపేట నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. పార్టీ విజయం సాధించిన తర్వాత తాను ముఖ్యమంత్రి పదవిని చేపడుతారని, లోకసభ ఎన్నికల సమయంలో రాజీనామా చేసి ముఖ్యమంత్రి పదవిని కేటిఆర్ కు అప్పగిస్తారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. లోకసభ ఎన్నికల్లో కేసిఆర్ పోటీ చేసి జాతీయ రాజకీయాలకు వెళ్లిపోతారని అంటున్నారు.
హరీష్ రావు కేటిఆర్ నాయకత్వానికి అంగీకరిస్తే తాను రాజీనామా చేసిన తర్వాత సిద్ధిపేట సీటు నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేయిస్తారని అంటున్నారు. హరీష్ రావు ఈలోగా తీసుకునే నిర్ణయమే కీలకం కానుంది. హరీష్ రావుకే కాకుండా ఆయనకు సన్నిహితులనుకన్న దాదాపు 20 మందికి బీ ఫారాలు దక్కకపోవచ్చుననే ప్రచారం కూడా జరుగుతోంది. ఏమైనా, టీఆర్ఎస్ లో ముసలం పుట్టిందనేది మాత్రం వాస్తవం.
సంబంధిత వార్తలు
కారులో హరీష్ రావు ఉక్కిరిబిక్కిరి: సిద్ధిపేటపై కేసిఆర్ కన్ను
హరీష్ వేదాంత ధోరణి: గులాబీ గూడు చెదురుతోందా?
పొలిటికల్ రిటైర్‌మెంట్‌పై హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్‌కు ఓటేస్తే...: ఏపీకి ప్రత్యేక హోదాపై హారీష్ ట్విస్ట్