హరీష్ వేదాంత ధోరణి: గులాబీ గూడు చెదురుతోందా?

హరీష్ రావుకు టీఆర్ఎస్ లో చిక్కులు ఎదురవుతున్నాయనే ప్రచారం ముమ్మరమైంది. నిజానికి గత వారం రోజులుగా హరీష్ రావు విషయంలో గుసగుసలు ప్రారంభమయ్యాయి. 

Why Harish rao made the statement on retirement?

హైదరాబాద్: రాజకీయాలపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అల్లుడు, మంత్రి తన్నీర్ హరీష్ రావు వేదంత ధోరణి ప్రదర్శించడంపై రకరకాల ప్రచారాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అంతర్గత రాజకీయాలపై పలు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అయితే ఎవరు కూడా బహిరంగంగా మాట్లాడడానికి ఇష్టపడడం లేదు.

ఆదరణ ఉన్నప్పుడే రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఉందని, ఈ జన్మకు ఇది చాలు అని హరీష్ రావు శుక్రవారం ఇబ్రహీంపూర్ ఎన్నికల ప్రచార సభలో అన్నారు. దీంతో హరీష్ రావుకు టీఆర్ఎస్ లో చిక్కులు ఎదురవుతున్నాయనే ప్రచారం ముమ్మరమైంది. నిజానికి గత వారం రోజులుగా హరీష్ రావు విషయంలో గుసగుసలు ప్రారంభమయ్యాయి. 

దాదాపు 30 మంది తాజా మాజీ ఎమ్మెల్యేలతో కలిసి హరీష్ రావు బిజెపిలో చేరడానికి సిద్ధపడ్డారని, దాంతో కేసిఆర్ ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ప్రచారం సాగుతూ వస్తోంది. ఆయన వద్దకు పల్లా రాజేశ్వర రెడ్డి, వినోద్, ఈటల రాజేందర్ కేసిఆర్ తరఫున రాయబారులుగా వెళ్లినట్లు కూడా గుసగుసలు వినిపించాయి. టిఆర్ఎస్ అధికారిక దినపత్రిక నమస్తే తెలంగాణలో హరీష్ రావు వార్తలు ప్రచురించవద్దనే ఆదేశాలు కూడా వెళ్లినట్లు వినికిడి. అయితే, ఈ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందనేది తెలియదు. 

కానీ, హరీష్ రావు వేదాంత ధోరణి ఆ ఊహాగానాలకు మరింతగా ఊపిరి పోసింది. హరీష్ రావు చాలా కాలంగా టీఆర్ఎస్ లో అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం సాగుతూనే ఉంది. కేసిఆర్ పార్టీ పగ్గాలను, ప్రభుత్వ కార్యకలాపాలను పూర్తిగా తన తనయుడు, మంత్రి కేటీఆర్ చేతుల్లో పెట్టినట్లు తెలుస్తోంది. 

కేసిఆర్ తర్వాత కేటీఆర్ అనే అభిప్రాయం అన్ని వర్గాల్లో బలంగా పాతుకుపోయింది. టికెట్ల ఖరారులో కూడా కేటిఆర్ కీలక పాత్ర వహించినట్లు అర్థమవుతోంది. దానికి తోడు, రాజ్యసభ సభ్యుడైన కేసిఆర్ అల్లుడు సంతోష్ కుమార్ కూడా టీఆర్ఎస్ పార్టీలో చక్రం తిప్పుతున్నట్లు అర్థమవుతోంది. తన టికెట్ విషయంలో తాను సంతోష్ కు కూడా ఫోన్ చేశానని అసమ్మతి నేత కొండా సురేఖ ఇటీవల చెప్పిన విషయం అదే విషయాన్ని బలపరుస్తోంది. 

నిజానికి, చాలా కాలంగా కేటిఆర్ ను తన వారసుడిగా నిలబెట్టడానికి కేసిఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాదు నగర పాలక సంస్థ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం తర్వాత కేసిఆర్ ప్రయత్నాలు మరింతగా ముమ్మరమయ్యాయి. 

ఓ వైపు కేటిఆర్, మరో వైపు సంతోష్ కేసిఆర్ ఆంతరింగికులుగానూ, పార్టీ... ప్రభుత్వ వ్యవహారాల కీలక వ్యవహర్తలుగానూ మారిపోయిన హరీష్ రావు కేసిఆర్ కు దూరమైనట్లు ప్రచారం సాగుతోంది. తెలంగాణ ఉద్యమ కాలంలో కీలకంగా వ్యవహరించిన హరీష్ రావు తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసిఆర్ కు దూరమవుతూ వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. 

గతంలో కూడా హరీష్ రావు బిజెపితో మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్త తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ సమయంలో హరీష్ రావు స్వయంగా ముందుకు వచ్చిన ఆ వార్తలను ఖండించారు. మొత్తం మీద, గులాబీ గూడు చెదురుతున్నట్లు కనిపిస్తోంది. 

సంబంధిత వార్తలు

పొలిటికల్ రిటైర్‌మెంట్‌పై హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్‌కు ఓటేస్తే...: ఏపీకి ప్రత్యేక హోదాపై హారీష్ ట్విస్ట్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios