హైదరాబాద్: కరోనావైరస్ పై చర్చ సందర్భంగా కాంగ్రెసు సభ్యుడు మల్లు భట్టివిక్రమార్క చేసిన విమర్శలపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీవ్రంగా స్పందించారు. కరోనా వైరస్ పై శాసనసభలో స్వల్పవ్యవధి చర్చ సందర్భంగా శనివారం అది జరిగింది. కరోనావైరస్ ను అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని మల్లు భట్టివిక్రమార్క చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. అలాగే, కర్ణాటక నుంచి వచ్చిన సిద్ధిఖి అనే వ్యక్తి హైదరాబాదులోని తలాబ్ గడ్డకు వచ్చి ఇక్కడి ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుని వెళ్లిపోయి మరణించడాని విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై కూడా కేసీఆర్ తీవ్రంగా ప్రతిస్పందించాడు.   

కేంద్రం చర్యలు తీసుకోవడం లేదనేది దుర్మార్గమైన వ్యాఖ్య అని కేసీఆర్ అన్నారు. కరోనావైరస్ ను కూడా రాజకీయం చేయడం తగదని ఆయన అన్నారు. దేశానికి పట్టిన పెద్ద కరోనా వైరస్ కాంగ్రెసు అని, అది తుడిచిపెట్టుకుని పోవాలని, పోతుందని, ఇప్పటికే చాలా వరకు పోయిందని ఆయన అన్నారు. మల్లుభట్టి విక్రమార్క వ్యాఖ్యలను ఖండిస్తూ కేసీఆర్ ఓ పిట్టకథ చెప్పారు. 

Also Read: తెలంగాణలో మరో వ్యక్తికి కరోనా, ఇద్దరు అనుమానితులు: కేసీఆర్

"ప్రాచీన కాలంలో ఓ రాజ్యంలో గత్తర వచ్చింది. అది వచ్చి యాబై మంది మరణించారు. దాంతో రాజు ఓ భూతవైద్యుడిని పిలిపించాడు. భూతవైద్యుడు రాజ్యం పొలిమేరలోకి రాగానే గత్తర పొలిమేర దాటుతూ ఉంది. దాంతో ఇంత మందిని చంపేశావు కదా అని భూత వైద్యుడు అన్నాడు. దానికి గత్తర స్పందిస్తూ నేను చంపింది ఐదుగురినే అని, మిగతా వాళ్లు దగడు (ఆందోళన)తో చనిపోయారని చెప్పింది" అని కేసీఆర్ కథను ముగించారు.

దేశాన్ని నడిపేవాళ్లు ఏం చేయాలో అది చేస్తారని, కుండబద్దలు కొట్టినట్లు కేంద్రం చాలా అప్రమత్తంగా ఉందని ఆయన చెప్పారు. కేంద్రం లెక్కలేనన్ని చర్యలు తీసుకుందని, 135 కోట్ల మంది నివసిస్తున్న దేశంలో అకస్మాత్తుగా చేస్తారా, అలా చేసి ప్రజలను భయబ్రాంతులకు గురి చేయాలా అని ఆయన అన్నారు. ప్రతిపక్షంలో ఉండి అడ్డం పొడుగు చాలా మాట్లాడవచ్చునని, నోరుంది కదా అని మాట్లాడితే ఎలా అని కేసీఆర్ అన్నారు. ఆ మాటలకు కాంగ్రెసు సభ్యులు అభ్యంతరం చెప్పారు. 

Also read: అమెరికా దంపతులకు కరోనా... ఆస్పత్రి నుంచి జంప్

దానికి కేసీఆర్ ప్రతిస్పందిస్తూ...తాను ఎవరి పేరు కూడా చెప్పలేదని, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకోవద్దని, శవాల మీద ప్యాలాలు ఏరుకోవద్దని, అది సమాజానికి మంచిది కాదని, ప్రజలు భయాందోళనకు గురి కావద్దని తాము తీసుకుంటున్న చర్యలను పూర్తిగా చెప్పడం  లేదని ఆయన అన్నారు. 

కర్ణాటక వ్యక్తి గురించి భట్టి చేసిన ప్రస్తావనకు ప్రతిస్పందిస్తూ... పాతబస్తీని ఎందుకు బద్నాం చేయాలని ఆయన అడిగారు. చిల్లర టీవీగాడు ఏదో ప్రచారం చేస్తాడు, దాన్ని పట్టుకుని మాట్లాడాలా అని ఆయన అన్నారు. ఏడు రోజులుగా ఆరోగ్య శాఖ మంత్రి తిరుగుతున్నారని, తనకు కూడా దొరకడం లేదని, ఆరోగ్యశాఖ సిబ్బంది 24 గంటలు పనిచేస్తున్నారని ఆయన చెప్పారు.

కెనడాలో ప్రధాన మంత్రి భార్యకు కరోనావైరస్ వచ్చిందని, నాలుగైదు రోజులు ఎవరికీ చెప్పలేదని, ప్రజలను భయాందోళనలకు గురి చేయవద్దని అలా చేశారని, అయితే చివరకు ప్రధాన మంత్రి స్వయంగా ముందుకు తన భార్యకు కరోనావైరస్ వచ్చిందని, తాను కూడా క్వారంటైన్ చేసుకుంటున్నానని చెప్పాడని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం పనిచేసే పద్ధతి అలా ఉంటుందని ఆయన చెప్పారు. 

135 కోట్ల జనాభా ఉన్న మనదేశంలో 65 మందికే కరోనా వచ్చిందని, ఇద్దరు మాత్రమే మరణించారని ఆయన గుర్తు చేసారు. ప్రజలకు తగిన జాగ్రత్తలు కూడా చెబుతున్నామని ఆయన ్న్నారు. భయంకరమైన కరోనా ఎప్పుడు వదులుతుందో తెలియదని, అది వ్యాపించకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. 

కాంగ్రెసు పాలిత రాష్ట్రాలైన పంజాబ్, రాజస్థాన్ ల్లో కూడా కరోనా వైరస్ ఉందని, ఆ ప్రభుత్వాలు కూడా పనిచేస్తున్నాయని, ఇద్దరు చనిపోయారని చెప్పి రాజస్థాన్ ప్రభుత్వాన్ని బద్నాం చేద్దామా అని ఆయన అన్నారు. మన వద్ద ఉత్పాతమే లేదని, అటువంటప్పుడు ఆరు వేల మందికి వచ్చిందని భయపెట్టమంటారా అని ఆయన అన్నారు. 

విమర్శలు చేసి మీ పార్టీని కంపు చేసుకోవద్దని ఆయన కాంగ్రెసు సభ్యులకు సలహా ఇచ్చారు. మర్యాద కోసం మీకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చాం గానీ మీ మాటలను మేం పట్టించుకోబోమని ఆయన అన్నారు. తాను కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడుతున్నానని, ఏం చర్యలు తీసుకోవాలో తీసుకుంటామని కేసీఆర్ చెప్పారు.