హైదరాబాద్: ఇటలీ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనావైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని, మరో ఇద్దరు అనుమానితులను కూడా గుర్తించామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చెప్పారు. కరోనా వైరస్ సోకిన ఓ వ్యక్తి కోలుకుని గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారని ఆయన చెప్పారు. హైదరాబాదుకు వచ్చిన ఉత్పాతమేదీ లేదని, అయితే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ఇతర దేశాల నుంచి వచ్చినవారి వల్లనే ఇక్కడ కరోనా వైరస్ సోకుతోందని ఆయన చెప్పారు.

కరోనావైరస్ పై కేసీఆర్ శనివారం శాసనసభలో ప్రకటన చేశారు. 200 మందిని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెట్టామని ఆయన చెప్పారు. దేశంలోని ప్రధాన నగరాల్లో హైదరాబాదు ఆరో స్థానంలో ఉందని, దానివల్ల ఇతర దేశాల నుంచి హైదరాబాదుకు చాలా మంది వస్తుంటారని ఆయన చెప్పారు. కరోనా వైరస్ ఇక్కడ పుట్టింది కాదని, అయితే ఇతర దేశాల నుంచి వచ్చినవారి నుంచి వ్యాపించే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. 

Also Read: అమెరికా దంపతులకు కరోనా... ఆస్పత్రి నుంచి జంప్

హైదరాబాదుకు ప్రత్యక్ష విదేశీ విమానాలు ఏవీ రావడం లేదని, ఒక రకంగా అది మన అదృష్టమని ఆయన చెప్పారు. అయితే, విదేశాల నుంచి దేశానికి వచ్చేవారు ఎక్కడి నుంచి ఎక్కడి వెళ్తున్నారో తెలియదు కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఆయన చెప్పారు. దేశంలో 65 మందికి కోవిడ్ 19 సోకిందని, ఇప్పటికి ఇద్దరు మాత్రమే మరణించారని ఆయన చెప్పారు. 

ఇటువంటి వైరస్ కొత్తదేమీ కాదని, ప్రతి వందేళ్లకు లేదా 75 ఏళ్లకు ఓసారి వస్తున్నదేనని, 1890లో వచ్చిన స్పానిష్ ఫ్లూ వల్ల ప్రపంచ వ్యాప్తంగా 10 నుంచి 12 కోట్ల వరకు మరణించారని, మన దేశంలో కోటీ 4 లక్షల మంది చనిపోయారని ఆయన చెప్పారు. అది మనదేశంలో ముంబై నుంచి ఇతర ప్రాంతాలకు పాకిందని ఆయన అన్నారు. విదేశాల నుంచి ఉండే కనెక్టివిటీ వల్ల అది అలా వస్తుందని ఆయన చెప్పారు.  

Also Read: కరోనా భయం: ఇన్ఫోసిస్ కార్యాలయ భవనం ఖాళీ

ఎటువంటి ఉత్పాతం వచ్చినా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పొరుగు రాష్ట్రాల మాదిరిగా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాదుకు రోజుకు ఎంత మంది వస్తున్నారు, ఎన్ని విమానాలు వస్తున్నాయనే వివరాలను వెల్లడించారు. ఇతర రాష్ట్రాలు, ముఖ్యంగా కర్ణాటక తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు.

భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. ముందు జాగ్రత్తగా ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. భయం, ఆందోళన అవసరం లేదని ఆయన చెప్పారు. ఈ సాయంత్రం మంత్రివర్గం సమావేశమై కరోనా వైరస్ వ్యాపించకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన చెప్పారు.