తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి బయటకు వెళ్లగొట్టింది సర్కారు. బుధవారం కాంగ్రెస్ సభ్యులు సభలో లేకపోయినా.. వారిపై సిఎం కేసిఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నేతల పేర్లు తీసుకుని వారిపై కరుకు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పుట్టినప్పటినుంచి ఇప్పటి వరకు ప్రజలకు ఏరకమైన ద్రోహం చేసిందో విడమరచి చెప్పారు.

ఇక కాంగ్రెస్ జానారెడ్డి, చిన్నారెడ్డి, జీవన్ రెడ్డిల పేర్లు తీసుకుని వాళ్లపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. జానారెడ్డి, చిన్నారెడ్డి పదవులు రాగానే తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపించారు. దానం నాగేందర్, అంజన్ కుమార్ యాదవ్, రేణుకా చౌదరి లాంటి వాళ్లు కూడా తెలంగాణకు వ్యతిరేకంగానే చివరి వరకు పనిచేశారన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డితో జత కలిసి జీవన్ రెడ్డి కూడా తెలంగాణకు ఏర్పాటుకు వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపించారు. ఇక గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ అయితే ఏకంగా అప్పట్లో రఘువీరారెడ్డి పాదయాత్రకు మంగళహారతులు పట్టి స్వాగతం పలికారని విమర్శించారు.

తెలంగాణకు కాంగ్రెస్ పార్టే విలన్ నెంబర్ 1 అని విమర్శించారు. నాటినుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ వైఖరి అలాగే ఉన్నది. ఉద్యమాలను దెబ్బతీసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఉద్యమకారులను బలిగొన్నది కూడా కాంగ్రెస్ పార్టే. మూకుమ్మడి రాజీనామాలు చేస్తామన్నవారు చేయవచ్చు కదా? దానికి ఢిల్లీ అధిష్టానం అనుమతి ఎందుకు అని ప్రశ్నించారు. తుమ్మినా, దగ్గినా కాంగ్రెస్ వారికి ఢిల్లీ నుంచి పర్మిషన్ రావాలి అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో ఇండ్ల కుంభకోణం జరిగింది. మంథనిలో ఎంత పెద్ద కుంభకోణం జరిగిందో అందరికి తెలుసు అని దుద్దిళ్ల శ్రీధర్ బాబుపై పరోక్షంగా కామెంట్ చేశారు. రీ డిజైన్ గురించి మాట్లాడుతున్నారు. మీ బతుకులకు డిజైనే చేయలేదు కదా? అని విమర్శించారు.

తెలంగాణ ఎప్పుడో వచ్చేదే కానీ.. హైదరాబాద్ లేకుండా ఇస్తామన్నారు. హైదరాబాద్ లేకుండా తెలంగాణ వద్దని నేనే చెప్పానన్నారు. హైదరాబాద్ తో కూడిన తెలంగాణ కోసమే కొంత ఆలస్యమైందన్నారు. ఐదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని తాను కోరితే ఈ కాంగ్రెసోళ్లు పోయి పదేండ్లకు ఒప్పుకొని వచ్చిర్రు అని విమర్శించారు.