Asianet News TeluguAsianet News Telugu

త్వరలోనే జాతీయ పార్టీ విధి విధానాల రూపకల్పన: కేసీఆర్, మద్దతు పలికిన కుమారస్వామి


త్వరలోనే జాతీయ పార్టీ కి సంబంధించిన విధి విధానాలపై  కార్యాచరణను రూపొందించనున్నట్టుగా తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. ఇవాళ కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కేసీఆర్ తో భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలపై ఇద్దరు నేతలు చర్చించారు. 
 

KCR preparing New National Political Party Agenda
Author
First Published Sep 11, 2022, 7:22 PM IST

 హైద్రాబాద్:  ప్రత్యామ్నాయ జాతీయ ఎజెండాపై ఏకాభిప్రాయాన్ని సాధించగలిగామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.  త్వరలోనే జాతీయ పార్టీ ఏర్పాటు, విధివిధానాల రూపకల్పన జరుగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం నాడు తెలంగాణ సీఎం కేసీఆర్ తో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భేటీ అయ్యారు. హైద్రాబాద్  లోని ప్రగతి భవన్ లో కుమారస్వామి కేసీఆర్ తో సుమారు మూడు గంటలపాటు చర్చించారు. 

తెలంగాణ సాధించిన కేసీఆర్ అనుభవం దేశానికి అవసరమని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి అభిప్రాయపడ్డారు.  సకలవర్గాలను కలుపుకొని కేసీఆర్ తెలంగాణను సాధించారని ఆయన గుర్తు చేశారు.
 తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతూ తెలంగాణను ప్రగతి పథాన నడుపుతున్న కేసీఆర్ 
దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటుకు ముందుకు నడవాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ క్రియాశీలక భూమిక పోషించాలని ఆయన కోరారు. అందుకు తమ సంపూర్ణ మద్దతుంటుందని కుమారస్వామి ప్రకటించారు. 

 త్వరలోనే జాతీయ పార్టీని ప్రకటించి దేశ రాజకీయాల్లో కేసీఆర్  కీలక పాత్ర పోషించనున్నారనే వార్తలను కుమారస్వామి స్వాగతించారు.  వర్తమాన జాతీయ రాజకీయాల్లో, దేశ పాలనలో ప్రత్యామ్న్యాయ శూన్యత నెలకొందన్నారు. ఈ తరుణంలో  కెసిఆర్ వంటి సీనియర్ లీడర్ ఆవశ్యకత దేశానికి అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. 

సీఎం కేసీఆర్ తో కుమారస్వామి సుదీర్ఘంగా చర్చించారు. తమ నడుమ అర్థవంతమైన చర్చ సాగిందని కుమారస్వామి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 8 ఏండ్ల స్వల్పకాలంలోనే తెలంగాణ సాధించిన అభివృద్ధిని చూసి దేశమంతా చర్చిస్తుందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలవుతున్న 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, ఉచిత తాగునీరు, సాగునీరు, వ్యవసాయ అభివృద్ధిపై జరుగుతున్న చర్చను కేసీఆర్ తో కుమారస్వామి పంచుకున్నారు. తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా అనతి కాలంలోనే  ప్రశంసలు అందుకోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
 దేశానికి తెలంగాణ మోడల్ అవసరమున్నదని  కుమారస్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు.

దేశంలో విచ్చిన్నకర పాలన ధోరణులు రోజు రోజుకు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజల నడుమన విభజన సృష్టించే కుట్రలను సమిష్టిగా తిప్పికొట్టాల్సిన అవసరాన్ని సీఎం కేసీఆర్ వివరించారు.  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రమాదకర స్వార్థ  రాజకీయ పంథా, దాని పర్యవసానాలను ఇరువురు నేతలు చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లో దేశాన్ని మత విద్వేషపు ప్రమాదకర అంచుల్లోకి నెట్టబడకుండా కాపాడుకుంటామని  ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. 

 దేశ ప్రజాస్వామిక సమాఖ్య స్పూర్తిని కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులన్నీ ఐక్యం కావాల్సిన అవసరముందన్నారు.  దేశవ్యాప్తంగా బిజెపికి ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని కర్నాటక ముఖ్యమంత్రి సిఎం కెసిఆర్ తో అన్నారు. 

 జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి దేశ గుణాత్మక ప్రగతికోసం తన వంతు సహకారాన్ని అందించాలని కేసీఆర్ ను కుమారస్వామి కోరారు.  రాజకీయ పార్టీని స్థాపిస్తే తమ సంపూర్ణ మద్దతుంటుందని కుమార స్వామి  కేసీఆర్ కు చెప్పారు. 

 బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే అనే అభిప్రాయం దేశ ప్రజల్లో సన్నగిల్లిందని నేతలు అభిప్రాయపడ్డారు.  కాంగ్రెస్ నాయకత్వంపై దేశ ప్రజలు పూర్తిగా విశ్వాసం కోల్పోయిన పరిస్థితులే నేడు కనిపిస్తున్నాయని ఇద్దరూ నేతలు తమ చర్చల్లో అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామిక సమాఖ్య స్ఫూర్తి ఫరిఢవిల్లేలా ప్రాంతీయ పార్టీల ఐక్యత నేటి దేశ రాజకీయ తక్షణావసరమని  కుమారస్వామి, కేసీఆర్  లు తెలిపారు. 

జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి తెలంగాణ మాదిరిగానే దేశాన్ని కూడా నడిపించాలని తనపై రోజురోజుకూ వత్తిడి పెరుగుతున్న విషయాలను సీఎం కేసీఆర్ కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి దృష్టికి తీసుకు వచ్చారు. 

బీజేపీపై, మోడీ ప్రజావ్యతిరేక, నిరంకుశ వైఖరిపై ప్రజలు కోరుతున్న విషయాన్ని కేసీఆర్ ఈ సందర్శంగా గుర్తు చేశారు. తెలంగాణను నిత్యం ఇబ్బందులకు గురిచేస్తూ అనేక రకాలుగా ఆటంకాలు సృష్టిస్తున్న బీజేపీపై ప్రజలు పూర్తి వ్యతిరేక ధోరణితో ఉన్నారని కేసీఆర్ చెప్పారు.  టీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా గ్రామస్థాయి నుంచి , రాష్ట్ర స్థాయి  వరకు జాతీయ పార్టీని స్థాపించాలని తీర్మాణాలు చేశాయని కేసీఆర్ వివరించారు. 

దేశీయ వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే కుట్రలకు పాల్పడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ దమననీతిని నేతలు  ఖండించారు. వ్యవసాయ రంగాన్నే కాకుండా ఆర్థిక, సామాజిక తదితర అన్నిరంగాలను అధోగతిపాలు చేసే  బీజేపీ విధానాలపై నేతలు చర్చించారు. 

దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల ప్రతినిధులు రాష్ట్రంలో పర్యటించిన విషయాన్ని కేసీఆర్ కుమారస్వామి దృష్టికి తీసుకు వచ్చారు. రైతు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను పలువురు ప్రశంసించారన్నారు. 

 జాతీయ పార్టీ ఎజెండాపై  కేసీఆర్, కుమారస్వామిలు చర్చించారు. దేశ చరిత్రనే వక్రీకరిస్తూ కొనసాగుతున్న బీజేపీ విధ్వంసకర రాజకీయ ఎత్తుగడలను  ఎదుర్కోవాల్సి ఉందన్నారు. లేకపోతే  దేశంలో రాజకీయ, పాలనా సంక్షోభం తప్పదనే విషయాన్ని వారు అభిప్రాయపడ్డారు. 

 కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని కేసీఆర్  చెప్పారు. మౌలిక సమస్యలను గాలికొదిలి భావోద్వేగాలతో పబ్బం గడుపుకొనే బీజేపీ పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని కేసీఆర్ తెలిపారు. ఇందుకు  వచ్చే  సార్వత్రిక ఎన్నికలనే వేదికగా మలుచుకోవాలని ఈ సమావేశంలో వారిద్దరూ అభిప్రాయపడ్డారు. 

వర్తమాన సామాజిక, ఆర్థిక పరిస్థితులకు సరిపడే చైతన్యవంతమైన పాలన అవసరం ఉన్నదనే క్షేత్రస్థాయి  పరిస్థితులపై ఇద్దరూ నేతలు  చర్చించారు. ప్రత్యామ్నాయ రాజకీయ పంథానే నేడు దేశానికి అత్యవసరమని వారు ఏకాభిప్రాయానికి వచ్చారు.

also read:కేసీఆర్‌తో మూడు గంటల పాటు కుమారస్వామి భేటీ: జాతీయ రాజకీయాలపై చర్చ

ఢిల్లీ కేంద్రంగా జరిపిన చర్చలు, పలు రాష్ట్రాల సీఎంలతో జరిపిన చర్చల వివరాలను కేసీఆర్ కుమారస్వామి దృష్టికి తీసుకు వచ్చారు.  తెలంగాణ ఉద్యమం ప్రారంభించడానికి ముందు సాగిన అభిప్రాయ సేకరణ మాదిరిగానే ఇప్పటికే మేధావులు, ఆర్థిక వేత్తలు, వివిధ రంగాల నిపుణులతో సుదీర్ఘంగా  చర్చిస్తున్నట్టుగా కేసీఆర్ తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూధనాచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎ.జీవన్‌రెడ్డి, బాల్క సుమన్‌, ఎస్.రాజేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios