కెసిఆర్ జాతీయ రాజకీయాలలో పేరుతో, బిజెపి వ్యతిరేక,కాంగ్రెస్ వ్యతిరేక ఫ్రంట్ పేరుతో తెలంగాణ వదలి దేశాటనకు వెళ్లనున్నట్లు సమాచారం. ఆయన రిటైర్డు సైనికాధికారులతో , నేవీ అధికారులతో, న్యాయనిపుణులతో ఐఎఎస్ ఐపిఎస్  అధికారులతో, ఇతర ప్రముఖలతో చర్చలు సాగించనున్నట్లు టిన్యూస్ చెబుతూ ఉంది. ముంబాయి నగరంతో పాటు అన్ని ప్రముఖ నగరాలలో సమావేశాలు నిర్వహిస్తారని కూడా కెసిఆర్ కుటుంబానికి చెందిన టి న్యూస్ చానెల్ ప్రకటించింది. ఇంత పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకుని ఆయన అన్ని రాష్ట్రాల పర్యటనకు పోతున్నపుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రిబాధ్యతలను ఎవరికిస్తారు? ఇన్ చార్జ్ ముఖ్యమంత్రిగా తనయుడు కెటి రామ రావును చేస్తారా లేక పూర్తి స్థాయి పట్టాభిషేకమే ఉంటుందా?  ఒక నెలలోనే ఆయన ఈ పర్యటనలకు పూనుకుంటారని కూడా వార్తలు వినబడుతున్నాయి. అంటే నెలరోజులలో తెలంగాణలో పెద్ద రాజకీయ మార్పులు రాబోతున్నయన్నమాట.

జాతీయ రాజకీయాల పేరుతో ఆయన  కెటిఆర్ ను ముఖ్యమంత్రి చేసేందుకు చూస్తున్నారా అనే అనుమానం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.  ఎందుకంటే, దేశాన్ని మార్చే బృహత్తర కార్యక్రమంలో, పవిత్రమయిన బాధ్యతతో వెళ్తున్నపుడు కెటిఆర్ ను ముఖ్యమంత్రి చేయడాన్ని ఎవరూ వ్యతిరేకించరు. ముఖ్యంగాఇరిగేషన్ మంత్రి హరీష్ రావు అభిమానుల నుంచి అసంతృప్తి రావడానికి వీల్లేదు. వస్తే, వాళ్లంతా కేసిఆర్ వ్యతిరేకులవుతారు. ఈ సందర్భంగా అంతా కెసిఆర్ కు మద్దతు నీయాల్సిందే తప్ప ఆయన మనసుగాయపరిచే పనులేవీ చేయకూడదు. ఇతర పార్టీలు కూడా ఆయనకు మద్దతునీయాలని ఆయన కూతురు, నిజాంబాద్ ఎంపి కవిత కూడా సూచిస్తున్నారు.