హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సోమవారం నాడు రాష్ట్ర హైకోర్టుకు నివేదికను సమర్పించనుంది.రెండు రోజుల క్రితం ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం నిర్వహించిన చర్చల గురించి కూడ నివేదికను హైకోర్టుకు ఇవ్వనుంది ప్రభుత్వం.

ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 5వ తేదీ నుండి సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ సమ్మెకు కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ,సీపీఎంలు మద్దతును ప్రకటించాయి. 

ఆర్టీసీ కార్మికుల సమస్యపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్ గా స్పందించారు. భవిష్యత్తులో ఆర్టీసీ ఉండనే ఉండదని కుండబద్దలుకొట్టారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తూ ఆర్టీసీని మరింత నష్టాల్లోకి నెట్టారని ఆయన ఆరోపించారు.

ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ ఇక భవిష్యత్తులో ఉండబోదని కూడ సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. మరో వైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం తీసుకొన్న చర్యల గురించి సీఎం కేసీఆర్ అధికారులతో రెండు రోజుల పాటు సమీక్షించారు.ఈ నెల 26వ తేదీన ఆర్టీసీ కార్మికులతో రవాణ శాఖ కమిషనర్ సందీప్ సుల్తానియా, రవాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మలు చర్చలు జరిపారు.

ఈ చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. కార్మికుల డిమాండ్లపై అధికారులు సరిగా స్పందించలేదని ఆర్టీసీ జేఎసీ నేతలు ఆరోపించారు.తాము చర్చల కోసం సమావేశ మందిరంలోకి వెళ్లగానే అధికారులు తమ ఫోన్లను కూడ లాక్కొన్నారని ఆర్టీసీ జేఎసీ నేతలు విమర్శించారు.

కేవలం 21 డిమాండ్లపై మాత్రమే చర్చిస్తామని ఐఎఎస్ అధికారులు తమకు చెప్పడంతో 26 డిమాండ్ల విషయమై చర్చించాలని తాము పట్టుబట్టినట్టుగా ఆర్టీసీ జేఎసీ నేతలు ఆశ్వత్థామరెడ్డిలు మీడియాకు వివరించారు.

చర్చలకు మళ్లీ వస్తామని చెప్పి ఆర్టీసీ జేఎసీ నేతలు రాలేదని ఐఎఎస్ అధికారులు ఆరోపించారు. ఈ పరిణామాలపై రెండు రోజుల పాటు సీఎం కేసీఆర్ తో రవాణ శాఖాధికారులు రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లు చర్చించారు.నివారం, ఆదివారాల్లో సీఎం కేసీఆర్ ఈ విషయమై చర్చించారు. హైకోర్టుకు ఏ రకమైన నివేదికను ఇవ్వాలనే విషయమై చర్చించారు. 

Also Read:ఆర్టీసీ కార్మికుల సమ్మెపై గవర్నర్ తమిళిసై స్పందన ఇదీ

ఆదివారం నాడు కూడ సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల సమ్మెతో పాటు ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలపై సుధీర్ఘంగా చర్చించారు. భవిష్యత్తులో ఏం చేయాలనే దానిపై కూడ అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు.

ప్రస్తుతం నడుస్తున్న బస్సులకు తోడుగానే మరిన్ని ప్రైవేట్ బస్సులను నడిపేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపినా కూడ జేఎసీ నేతలు చర్చల మధ్య నుండే వెళ్లిపోయారని ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు నివేదించనుంది.
ఆర్టీసీ కార్మికులతో చర్చల సమయంలో ఐఎఎస్ అధికారులు, జేఎసీ నేతలు ఏం మాట్లాడారనే విషయాన్ని వీడియో రికార్డింగ్ చేశారు.నిర్ధేశించిన సమయం కంటే ఆలస్యంగా ఆర్టీసీ జేఎసీ నేతలు  చర్చలకు వచ్చారని ఐఎఎస్ అధికారులు ప్రకటించారు. అయితే ఈ ప్రకటనను జేఎసీ నేతలు ఖండించారు.

Also Read:ఒకే దెబ్బకు రెండు పిట్టలు: తమిళిసైకి కేసీఆర్ కౌంటర్!

ఆర్టీసీ జేఎసీ నేతలు చర్చల నుండి మధ్య నుండే వచ్చిన విషయాన్ని హైకోర్టుకు ప్రభుత్వం వివరించనుంది.ఆర్టీసీ సమ్మెతో ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండాలనే  ఉద్దేశ్యంతో ప్రత్యామ్నాయ చర్యలను కూడ తీసుకొన్న విషయాన్ని హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం వివరించనుంది.ఆర్టీసీ సమ్మె విషయంలో తెలంగాణ హైకోర్టు ఇవాళ ఏ రకమైన నిర్ణయం తీసుకొంటుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.