హుజూర్ నగర్: హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి శానంపూడి సైది రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించినందుకు హుజూర్ నగర్ ప్రజలకు థాంక్స్ చెప్పేందుకు కేసీర్ శనివారం హుజూర్ నగర్ వచ్చారు. ఇక్కడి బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. 

కెసిఆర్ చేసిన ఒక ప్రకటన చూస్తే చాల తెలివిగా ప్రజల్లోకి ఒక విషయాన్నీ ఇతర రాజకీయ నేతల కన్నా సమర్థవంతంగా ఎలా  తీసుకెళ్ల గలుగుతాడో మనకు అర్థమవుతుంది. పోడు భూముల పరిష్కారానికి ప్రజా దర్బారులు నిర్వహిస్తామని చెప్పాడు. 

ఈ ప్రకటన వల్ల ఒక్క దెబ్బకు రెండు పిట్టలుగా కెసిఆర్ స్కెచ్ వేసినట్టు మనకు అర్థమవుతుంది. రాష్ట్రంలో పోడు భూముల సమస్య ఎంత తీవ్రంగా ఉందొ ఎఫ్ఆర్వో అనితపై జరిగిన దాడిని చూస్తే మనకు అర్థమవుతుంది. 

తెలంగాణాలో జెండా పాతేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీ ఈ అంశాన్ని ఎత్తుకొని తెలంగాణాలో రాజకీయంగా బలపడాలని చూస్తుంది. ఇప్పటికే తెలంగాణాలో ఆదివాసీలకు,లంబాడాలకు రేజర్వేషన్ల విషయంలో చిన్న సైజు యుద్ధమే నడుస్తుంది. ఆదివాసీలు ఒకింత కెసిఆర్ పై గుర్రుగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. పార్లమెంటు ఎన్నికల్లో సోయం బాపూరావు గెలుపు మనకు ఒకింత అక్కడి వాస్తవిక పరిస్థితిని తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. 

also read#huzurnagar result: హుజూర్‌నగర్‌‌లో ఆర్టీసీ బస్సు ఫెయిల్, కారు జోరుకు కారణం ఇదే..

ఇప్పటికే కెసిఆర్ తన సర్కారులో లంబాడా అయిన సత్యవతి రాథోడ్ కి మంత్రి పదవి కట్టబెట్టారని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. కెసిఆర్ పట్ల వారికున్నఈ వ్యతిరేకతను వాడుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో పోడు భూముల విషయంలోనైనా కనీసం వారి సమస్యలను పరిష్కరిస్తే రాజకీయంగా సమస్య పెద్దదికాకుండా ఉంటుంది. ఈ విషయాన్నీ ఎరిగే కెసిఆర్ నడుచుకున్నాడు. 

ఇక రెండో ఉద్దేశం ప్రజా దర్బార్ అనే పదం వాడడం. అందరికి గనుక గుర్తుంది ఉంటె గవర్నర్ తమిళిసై రాగానే ట్విట్టర్ వేదికగా ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్టు తెలిపింది. వారంలో ఒక రోజు రాజ్ భవన్ లో నిర్వహించడం మొదలుపెట్టబోతున్నట్టు తెలిపారు. 

related article#అచ్చం కుముద్ బెన్ జోషీ లాగే తమిళిసై: కేసీఆర్ పక్కలో బల్లెం?

ప్రజలెన్నుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ అందుబాటులో ఉండరు. గవర్నర్ ప్రజా దర్బార్ అని మొదలుపెడితే వ్యవహారం చేజారిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో కెసిఆర్ ఆమె ప్రారంభించేకన్నా ముందే తన ప్రభుత్వం స్టార్ట్ చేసిందనే ఇండికేషన్ ని ప్రజలకు ఇవ్వాలనుకున్నాడు. ఇచ్చాడు. తెలివిగా కెసిఆర్ ఈ ప్రజా దర్బార్ వ్యవహారం మునిసిపల్ ఎన్నికలకు ముందు బీజేపీకి ప్రచారాస్త్రం కాకుండా చూడగలిగారని చెప్పవచ్చు. ఒక వేళ గవర్నర్ గనుక మునిసిపల్ ఎన్నికల వేళ ఈ ప్రజా దర్బార్ మొదలుపెట్టి ఉంటె బీజేపీ దాన్ని ప్రచారాస్త్రంగా చేసుకొని దూసుకుపొయ్యేవారు. జరుగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఇది మరిన్ని నూతన తలనొప్పులు తెచ్చిపెట్టేవి. 

ఈ విధంగా కెసిఆర్ ఒక్క దెబ్బకు రెండు పిట్టలను కొట్టాడు. 

రాష్ట్రంలో కెసిఆర్ కు చిక్కులు సృష్టించాలనుకున్న గవర్నర్ తమిళిసై గారికి కౌంటర్ ఇవ్వడమే కాకుండా ఒక చిన్న సమస్య పెద్దగా కాకుండా కూడా అడ్డుకోగలిగినట్టవుతుంది.