హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం చర్చిస్తోందని  తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు.

దీపావళిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం నాడు రాజ్‌భవన్‌లో ప్రజా దర్బార్ నిర్వహించారు.ప్రజా దర్బార్ సందర్భంగా పలు రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖులు గవర్నర్  తమిళిసై సౌందర రాజన్ ను కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా  తెలంగాణ గవర్నర్  తమిళిసై సౌందర రాజన్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ తన స్వంత ఇల్లు లాంటిదని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. రాష్ట్రంలోని గిరిజనుల సమస్యలను తెలుసుకొనేందుకు తాను గిరిజన  ప్రాంతాల్లో పర్యటించనున్నట్టు ఆమె తెలిపారు.

ప్రజల సమస్యలను తెలుసుకొనేందుకు గాను తాను ఈ పర్యటన చేపట్టినట్టుగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చెప్పారు. రాజ్ భవన్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించినట్టుగా గవర్నర్  తెలిపారు.

Also read:ఒకే దెబ్బకు రెండు పిట్టలు: తమిళిసైకి కేసీఆర్ కౌంటర్!

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కారం కోసం  తమిళనాడు గవర్నర్ చొరవ చూపాలని  జేఎసీ నేతలు రెండు దఫాలు ఆమెతో భేటీ అయ్యారు. ఆర్టీసీ  కార్మికులు హైకోర్టు తీర్పు తదితర విషయాలను గవర్నర్ తో చర్చించారు.

ఈ నెల 5వ తేదీ నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, జనసేనలు మద్దతు ప్రకటించారు.