తమిళిసైపై సుప్రీంకోర్టుకు కేసీఆర్ సర్కార్: 10 బిల్లులు ఆమోదం కోసం పిటిషన్
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తీరుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పై కేసీఆర్ సర్కార్ గురువారంనాడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 10 బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు చేసింది. ప్రతివాదులగా గవర్నర్ కూడా చేర్చారు. తెలంగాణ ప్రభుత్వం పంపిన 10 బిల్లులును గవర్నర్ ఆమోదించకుండా తొక్కి పెట్టడంపై ప్రభుత్వం అసంతృప్తితో ఉంది.ఈ 10 బిల్లులను ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేసే అవకాశం ఉంది.
యూనివర్శిటీల్లో నియామకాలు చేపట్టేందుకు కామన్ బోర్డు ఏర్పాటు,ప్రైవేట్ విశ్వ విద్యాలయాల చట్టసవరణ, జీహెచ్ఎంసీ, పురపాలక చట్టాలకు సవరణ,ములుగులో ఫారెస్ట్ పరిశోధన సంస్థ, పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్టం, జీఎస్టీ చట్ట సవరణ, ఆజామాబాద్ పారశ్రామిక ప్రాంత చట్టం వంటి బిల్లులు రాజ్ భవన్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి.
వీటిలో ఎనిమిది బిల్లులను తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలిలు ఆమోదం తెలిపాయి. ఈ బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర పడాలి. అయితే ఈ బిల్లులను అధ్యయనం చేస్తున్నట్టుగా గతంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రకటించిన విషయం తెలిసిందే. యూనివర్శిటీల్లో నియామకాల విషయంలో కామన్ బోర్డు ఏర్పాటు అంశానికి సంబంధించి యూజీసీతో కూడా గవర్నర్ సంప్రదింపులు జరిపిన విషయం తెలిసిందే.
బిల్లులను అధ్యయనం చేయడం కోసం పెండింగ్ లో ఉంచినట్టుగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ గతంలో ప్రకటించారు. మరో వైపు తన వద్ద పెండింగ్ లో బిల్లులు ఏమీ లేవని కూడా ఆమె ప్రకటించారు. అయితే 10 బిల్లులు ఆమోదించకుండా గవర్నర్ పెండింగ్ లో ఉంచారని ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం ప్రస్తుతం చర్చకు దారి తీసింది.
ఈ ఏడాది జనవరి 31న బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం తెలపడం లేదని హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పటిషన్ పై విచారణ నిర్వహించే సమయంలో హైకోర్టు సూచన మేరకు రాజ్ భవన్, ప్రగతి భవన్ న్యాయవాదులు చర్చించుకున్నారు. గవర్నర్ పై విమర్శలపై రాజ్ భవన్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. రాజ్యాంగబద్దంగా వ్యవహరిస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది పేర్కొన్నారు. దీంతో ఇరువర్గాలు రాజీకి వచ్చాయి.ఇదే విషయాన్ని హైకోర్టుకు తెలిపాయి. తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకుంది.
also read:మెడికో ప్రీతి మరణంపై సమగ్ర విచారణ: కాళోజీ హెల్త్ యూనివర్శిటీ వీసీకి గవర్నర్ ఆదేశం
తెలంగాణ అసెంబ్లీ బడ్సెట్ సమావేశాలకు గవర్నర్ ను ఆహ్వానించింది ప్రభుత్వం. గత నెల 6వ తేదీన తమిళిసై ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీంతో రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య రాజీ కుదిరిందని భావించారు. కానీ పెండింగ్ బిల్లుల అంశంపై సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం వెళ్లడంతో మరోసారి రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్ అంశం తెరపైకి వచ్చింది.