రాష్ట్రంలో వేలాది మంది బీడీలు చుట్టి బతుకుతున్నారు. బీడీ పరిశ్రమపై అధిక పన్నులు వేయడం వల్ల వారి ఉపాధికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. దీనిపై కేంద్రం పునరాలోచించాలి. బీడీ పరిశ్రమను జిఎస్టీ నుంచి మినహాయించాలి.
జిఎస్టీ విషయంలో కేంద్రానికి సంపూర్ణ మద్ధతు ప్రకటించిన కెసిఆర్ తాజాగా తన వైఖరి మార్చుకున్నారు. బీడీ పరిశ్రమతోపాటు మరో మూడు అంశాలను జిఎస్టీ నుంచి మినహాయించాలని కోరుతున్నారు కెసిఆర్. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ, దేశ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలకు దీనిపై లేఖలు రాశారు.
బీడీ పరిశ్రమ, గ్రానైట్ పరిశ్రమ, మిషన్ భగీరథ పనులు, నీటి పారుదల ప్రాజెక్టుల పనులను జిఎస్టీ నుంచి మినహాయించాలని సీఎం కెసిఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో వేలాది మంది బీడీలు చుట్టి బతుకుతున్నారని, బీడీ పరిశ్రమపై అధిక పన్నులు వేయడం వల్ల వారి ఉపాధికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో 2వేలకు పైగా గ్రానైట్ యూనిట్లు ఉన్నాయని తన లేఖలలో వివరణ ఇచ్చారు. వీటిలో 2 లక్షల మంది ప్రత్యక్షంగా, ఐదు లక్షల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారన్నారు.
గ్రారైన్/మార్బుల్ రా బ్లాక్స్ పై 12 శాతం, ఫినిష్ చేసిన ఉత్పత్తులపై 28 శాతం పన్ను విధిస్తూ జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నది దీంతో ఎక్కువ పన్ను వేయడం వల్ల గ్రానైట్ పరిశ్రమ దెబ్బతిని లక్షలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉన్నది.
రా బ్లాక్స్, ఫినిష్డ్ ఉత్పత్తులు... రెండింటిపై 12 శాతం పన్ను విధించాలని సిఎం కోరారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించడం కోసం మిషన్ భగీరథ, రైతులకు సాగునీరు అందించడం కోసం నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మిస్తున్నది
పనులపై అత్యధిక జిఎస్టీ విధించడం భావ్యం కాదని, పునరాలోచించాలని సిఎం విజ్ఞప్తి చేశారు.
తాము చేసిన విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించాలని, ఈ నాలుగు అంశాల్లో జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిన పన్ను రేట్లు తమ రాష్ట్రంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు కెసిఆర్.
దేశం మొత్తం మీద ఒకే పన్ను విధానం ఉండేందుకు జిఎస్టీ అమలు చేయడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు.
ప్రతిపాదన దశ నుంచి అమలు దశ వరకు దేశంలోని రాష్ట్రాలను కలుపుకుని పోయిన విధానంపై సిఎం కేంద్రానికి అభినందనలు తెలిపారు.
