తెలుగుదేశం పార్టీపై మరోసారి అభిమానం చాటుకున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. టీడీపీని తన తల్లి పార్టీ అని ఆయన పేర్కొనడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. రాజకీయంగా ఓనమాలు దిద్దింది, ఎదిగింది తెలుగుదేశం పార్టీలోనే అన్న సంగతి తెలిసిందే. అందుకే ఆయన టీడీపీని తన పుట్టినిల్లు అని, కాంగ్రెస్‌ని మెట్టినిల్లు అని అంటూ వుంటారు. సందర్భం వచ్చినప్పుడల్లా టీడీపీపైనా అభిమానం చాటుకుంటూ వుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీని తన తల్లి పార్టీ అని పేర్కొనడం తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతోంది. దీనిపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పందించారు. టీడీపీలోకి రేవంత్‌ను ఆహ్వానిస్తున్నామని.. ఆయనకు తాము ఘన స్వాగతం పలుకుతున్నామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు అత్యధిక సీట్లు ఇస్తామని కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. పొత్తులపై ఎన్నికల సమయంలోనే నిర్ణయాలు వుంటాయని.. తెలంగాణ టీడీపీకి సంబంధించి త్వరలోనే పూర్తి స్థాయి నియామకం చేపడతామని జ్ఞానేశ్వర్ అన్నారు. 

మరోవైపు సదరు ఇంటర్వ్యూలో పొత్తులపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ అంశం అధిష్టానం పరిధిలోని విషయమని తేల్చేశారు. అయితే రాష్ట్ర నాయకత్వం తరపున తాము సూచనలు, సలహాలు మాత్రమే ఇస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే అంతిమ నిర్ణయం మాత్రం హైకమాండ్‌దేనని రేవంత్ వెల్లడించారు. 

Also Read: ఖబడ్దార్ .. నాతో పెట్టుకోకు : రేవంత్‌ రెడ్డికి రేగా కాంతారావు వార్నింగ్, పరువు నష్టం దావాకు రెడీ

ఇకపోతే, తెలంగాణ టీడీపీ అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలలో కదలిక వచ్చింది. గతేడాది ఖమ్మంలో చంద్రబాబు నాయుడు సభను కూడా నిర్వహించారు. ఈ సభ విజయవంతం కావడంతో.. రాష్ట్రంలో సత్తా చాటాలనే లక్ష్యంతో ప్రణాళికలను మరింతగా వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే త్వరలోనే ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్‌లో కూడా సభ నిర్వహించాలని టీ టీడీపీ భావిస్తోంది. ఇక, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నుంచి వివిధ పార్టీల్లోకి వెళ్లిన నేతలంతా తిరిగి పార్టీలోకి రావాలని ఖమ్మంలో జరిగి సభ వేదికగా చంద్రబాబు ఆహ్వానించారు.