Asianet News TeluguAsianet News Telugu

పాలేరు టికెట్ నాకే.. కమ్యూనిస్టులకు జనం ఇంకా ఓట్లేస్తున్నారా : కందాల ఉపేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

వచ్చే తెలంగాణ ఎన్నికల్లో పోటీకి సంబంధించి పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకే టికెట్ వస్తుందని.. సీపీఎం పోటీ చేస్తుందన్న ప్రచారంలో నిజం లేదని ఆయన తేల్చేశారు

kandala upender reddy sensational comments on upcomming telangana elections
Author
First Published Mar 25, 2023, 9:02 PM IST

పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పాలేరు సీటు తనకు తప్ప ఎవరికీ రాదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీటు తనకే వస్తుందని.. తానే పోటీ చేస్తానని కందాల ఉపేందర్ రెడ్డి స్పష్టం చేశారు. సీపీఎం పోటీ చేస్తుందన్న ప్రచారంలో నిజం లేదని ఆయన తేల్చేశారు. కమ్యూనిస్టులకు ఓట్లు వేసే రోజులు పోయాయని.. ప్రజా చైతన్య యాత్రలు పెట్టి మాకే సీటని అంటున్నారని కందాల ఎద్దేవా చేశారు. తాను మంచి చేస్తాననే నమ్మకం వుంటేనే తనకు ఓట్లు వేయాలని, అట్టడుగున వున్న ప్రజలకు తాను సాయం చేస్తున్నానని ఉపేందర్ రెడ్డి తెలిపారు. 

ఇదిలావుండగా.. తెలంగాణలో పాలేరు నియోజకవర్గం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రంలు ఇక్కడి నుంచే పోటీ చేయాలని పావులు కదుపుతున్నారు. షర్మిలకు ఎలాంటి అడ్డంకులు లేనప్పటికీ.. బీఆర్ఎస్‌లోనే ఆశావహుల జాబితా ఎక్కువగా వుంది. సిట్టింగ్‌లకు టికెట్ ఇస్తానని కేసీఆర్ చెప్పారు. దీంతో ఈసారి తనకే టికెట్ కన్ఫర్మ్ అయ్యిందని కందాల ఉపేందర్ రెడ్డి అంటున్నారు. అయితే గత ఎన్నికల్లో ఓటమితో నిరాశలో కూరుకుపోయిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం మరోసారి పాలేరు నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టాలని చూస్తున్నారు. అయితే కందాల ఆయనకు అడ్డుగా వున్నారు. 

ALso REad: పాలేరు నుంచే పోటీ చేస్తున్నా .. ఆశీర్వదించండి : ప్రజలను కోరిన వైఎస్ షర్మిల

అటు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పాలేరు బరిలో దిగాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్‌లో వుండగా.. త్వరలోనే పార్టీ మారనున్నారు. ఇక కమ్యూనిస్టులకు గతంలో ఇక్కడ గెలిచిన చరిత్ర వుండటంతో తమ్మినేని వీరభద్రం ఈ స్థానంపై కన్నేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నందున ఎన్నికల సమయంలో ఈ స్థానం తమకు కేటాయించాలని సీపీఎం కోరే అవకాశం వుంది. మరి భవిష్యత్‌లో ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios