సొంత తండ్రి కేసీఆర్ అధ్యక్షుడిగా, సోదరుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న బిఆర్ఎస్ పార్టీపైనే కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ తో కలిసి బిఆర్ఎస్ భూమాఫియాను నడిపిస్తోందని ఆరోపించారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి భూముల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం వందల ఎకరాల భూములను కబ్జా చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది... ప్రభుత్వం కూడా ఈ భూములపై విచారణ చేపట్టింది. ఇలాంటి సమయంలో రంగారెడ్డి జిల్లా కొంగరకుర్దు-ఏ గ్రామంలోని భూములపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు.
కొంగరకుర్దు-ఏ గ్రామానికి చెందిన బాధిత రైతులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన కవిత… కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు చెందిన ముఖ్య నాయకులు కలిసి భూ మాఫియాకు సహకరిస్తున్నారని ఆరోపించారు. కొంగరకుర్దులోని వక్ఫ్ భూముల విషయంలో రైతులకు న్యాయం జరగాలని… అక్రమంగా జరిగిన రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో తన తండ్రి కేసీఆర్‌కు చెందిన బీఆర్‌ఎస్ పార్టీపై కూడా కవిత తీవ్ర విమర్శలు చేశారు. భూ మాఫియాపై మొదట వార్తలు రాసిన ‘నమస్తే తెలంగాణ’, ‘సాక్షి’ వంటి పత్రికలు ఆ తర్వాత వెనక్కి తగ్గాయని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌లోని కీలక నేతల ఒత్తిడి కారణంగానే కొంగరకుర్దు భూ వ్యవహారం మరుగున పడిందని కవిత వ్యాఖ్యానించారు.
580 ఎకరాల భూమిపై కవిత ఆరోపణలు
కొంగరకుర్దు-ఏ గ్రామ పరిధిలో సర్వే నంబర్లు 2 నుంచి 400 వరకు ఉన్న సుమారు 580 ఎకరాల భూమిని 2007లో వక్ఫ్ భూమిగా గెజిట్‌లో చేర్చారని కవిత తెలిపారు. ఈ భూములు 22ఏ నిషేధిత జాబితాలో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఆ భూముల్లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు జరుగుతున్నాయని, ఇప్పటికే సుమారు 150 ఎకరాలు భూ మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయాయని ఆమె ఆరోపించారు.
2022లో కొంగరకుర్దు భూములపై భూ మాఫియా కన్ను పడిందని కవిత ఆరోపించారు. ఒక రైతు సుమారు 58 ఎకరాల్లో పంటలు సాగు చేస్తే.. మూడు జేసీబీలతో ఆ పంటను ధ్వంసం చేసి అక్కడ లేఅవుట్ వేసే ప్రయత్నం చేశారని ఆమె పేర్కొన్నారు. భూములను సాగు చేసుకుంటున్న రైతులు రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసులు కూడా నమోదు చేయడం లేదని కవిత ఆరోపించారు. గ్రామంతో సంబంధం లేని వ్యక్తుల పేర్లతో ఓఆర్‌సీలు సృష్టించి, వాటి ఆధారంగా కోర్టుల్లో కేసులు వేసి అనుకూల తీర్పులు తెచ్చుకున్న తర్వాత రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారని ఆమె అన్నారు.
బీఆర్‌ఎస్‌పై కవిత కీలక వ్యాఖ్యలు
ఈ ప్రెస్‌మీట్‌లో కవిత చేసిన వ్యాఖ్యల్లో బీఆర్‌ఎస్‌పై విమర్శలు ప్రత్యేకంగా చర్చకు వచ్చాయి. తన తండ్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ పార్టీపై గతంలోనూ విమర్శలు చేసిన కవిత.. కొంగరకుర్దు వ్యవహారంలోనూ ఆ పార్టీ ముఖ్య నాయకుల పాత్రపై ఆరోపణలు చేశారు. ‘నమస్తే తెలంగాణ’లో భూ మాఫియాపై ఒక్కరోజు కథనం రాసింది… ఆ వెంటనే కథనాలు ఆగిపోయాయని కవిత ఆరోపించారు. అలాగే ‘సాక్షి’లో కూడా మొదట భూ మాఫియాకు వ్యతిరేకంగా కథనం వచ్చింది… మరుసటి రోజు రైతులకు వ్యతిరేకంగా కథనం వచ్చిందని ఆమె వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌లోని ఒక ముఖ్య నేత ఒత్తిడితోనే ఈ వ్యవహారం పక్కన పెట్టారని ఆమె ఆరోపించారు.. దీనిపై బీఆర్‌ఎస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
“కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు కలిసి రూ.5 వేల కోట్ల విలువైన 580 ఎకరాల భూమిని కొట్టేస్తున్నారు” అంటూ కవిత తీవ్ర ఆరోపణ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవస్థీకృతంగా భూ మాఫియా పెరిగిపోయిందని ఆమె అన్నారు.
ఈ వెంచర్లపై కవిత ఆరోపణలు
కొంగరకుర్దులో అర్బన్ క్రెస్ట్, సిటీ గ్రాండ్ ఎన్ క్యూ వెంచర్స్ పేరుతో భారీ లేఅవుట్లు వేశారని కవిత ఆరోపించారు. 2022 తర్వాత ఈ ప్రాంతంలో జరిగిన అన్ని రిజిస్ట్రేషన్లను పరిశీలించి, అవకతవకలు ఉన్నట్టు తేలితే వాటిని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములకు లేఅవుట్ పర్మిషన్లు ఎలా ఇచ్చారంటూ హెచ్‌ఎండీఏపై కూడా ఆమె ప్రశ్నలు సంధించారు. ప్రస్తుతం కూడా ప్రభుత్వ రికార్డుల్లో ఈ భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయని కవిత పేర్కొన్నారు.
కోర్టు వివాదం కొనసాగుతోందన్న కవిత
కొంగరకుర్దులో భూములు సాగు చేసుకుంటున్న రైతులకు, వక్ఫ్ బోర్డుకు మధ్య న్యాయ వివాదం కొనసాగుతోందని కవిత తెలిపారు. కోర్టు తుది తీర్పు వచ్చిన తర్వాత ఆ భూములపై హక్కు ఎవరికి ఉంటుందనే విషయం స్పష్టమవుతుందని ఆమె అన్నారు. అందువల్ల కోర్టు తీర్పు వెలువడకముందే భూములపై లావాదేవీలు, లేఅవుట్లు, విస్తరణలు జరపడం సరికాదని కవిత పేర్కొన్నారు. అర్బన్ క్రెస్ట్, సిటీ గ్రాండ్ ఎన్ క్యూ సంస్థలు ఇకపై ఒక్క గజం భూమిలోనైనా వెంచర్‌ను విస్తరించినా రంగారెడ్డి కలెక్టర్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టుకు లాగుతానని హెచ్చరించారు.
నకిలీ ఓఆర్‌సీలపై ఆరోపణలు
కొంగరకుర్దులో గ్రామంతో సంబంధం లేని వ్యక్తుల పేర్లతో ఓఆర్‌సీలు సృష్టించారని కవిత ఆరోపించారు. నర్సమ్మ అనే రైతుకు చెందిన భూమికి లక్ష్మి పేరుతో ఓఆర్‌సీ తెచ్చుకున్నారని ఆమె ఉదాహరణగా ప్రస్తావించారు. ఇలాంటి అక్రమాలు మరెన్నో ఉన్నాయని, వాటన్నింటినీ ప్రభుత్వం వెంటనే పరిశీలించాలని డిమాండ్ చేశారు.
“బీఆర్‌ఎస్ పాలనలో కొన్ని ఇండ్లే బంగారం అయ్యాయి”
బీఆర్‌ఎస్ పాలనలో “కొన్ని ఇండ్లే బంగారం అయ్యాయి” అని తాను ఇప్పటికే చెప్పానని... కొంగరకుర్దు భూముల వ్యవహారం కూడా ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోందని కవిత వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు కలిసి భూముల వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారనే తన ఆరోపణలను మరోసారి పునరుద్ఘాటించారు.
ఇలా కొంగరకుర్దు భూముల విషయంలో కవిత చేసిన ఆరోపణలపై ప్రభుత్వం, బీఆర్‌ఎస్ నాయకులు, సంబంధిత నిర్మాణ సంస్థలు, అధికారులు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా వక్ఫ్ భూముల హోదా, 22ఏ నిషేధిత జాబితా, ఓఆర్‌సీల చెల్లుబాటు, లేఅవుట్ అనుమతులు, జరిగిన రిజిస్ట్రేషన్లపై అధికారిక రికార్డులు, న్యాయస్థానాల తుది తీర్పుల ఆధారంగానే అసలు వాస్తవాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది.


