భూకుంభకోణాల విషయంలో తెలంగాణ సర్కారు ద్వంద వైఖరి అవలంభిస్తోంది. ఈ విషయంలో తప్పులే జరగలేదు...  సీబీఐ విచారణ ఏమొద్దంటున్న ప్రభుత్వం మరోవైపు  భూ రిజిస్ట్రేషన్లలో తలెత్తిన అవకతవకల జాబితాను విడుదల చేసింది. తక్షణమే భూ కుంభకోణంలో ఉన్నవారు ఎంతటి వారైనా వారి పేర్లు బయట పెట్టాలి.

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో జరుగుతున్న భూ ఆక్రమణలపై టిజెఎసి స్పందించింది. జెఎసి ఛైర్మన్ కోదండరాం దీనిపై ఒక ప్రకటన విడుదల చేశారు.

భూముల ఆక్రమణలలో ప్రభుత్వ యంత్రాగం పాత్ర ఉన్నదని స్పష్టంగా కనబడుతుందని సర్కారు ప్రకటనలు చూస్తే అర్థమవుతుందన్నారు టి జెఎసి నేత కోదండరాం. చాలా మంది రాజకీయ నాయకులు అధికారులపై వత్తిడి తెచ్చి భూములు కబ్జా చేసుకుంటున్నారని కూడా ప్రభుత్వం చేసిన ప్రకటనలు తేటతెల్లం చేస్తున్నాయని తెలిపారు. ఇందులో మొదటిది; పాత జాగీర్దార్ల పేరుతో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నారని మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో ప్రభుత్వం గుర్తించిందన్నారు.

ఈ నేపథ్యంలో టీజేఏసీ ప్రభుత్వాన్ని దిగువ చర్యలు తీసుకోవాలని కోరుతున్నది.

భూముల ఆక్రమణకు పాల్పడిన వారు ఏస్థాయిలో ఉన్నా, వారిపేర్లను బహిర్గతం చేయాలి.

భూ ఆక్రమణలపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే తక్షణమే కేసును సీబీఐకి అప్పగించాలి.

భూ ఆక్రమణలకు కారణాలను వెతికి వాటిని రూపుమాపడానికి తీసుకునే చర్యలను సూచించే లక్ష్యంతో న్యాయవిచారణకు ఆదేశించాలి.