తెలంగాణలో తాజాగా భూముల  కుంభకోణం హాట్ టాపిక్ అయింది. ఈ కుంభకోణంలో అనూహ్యంగా అధికార టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల పేర్లు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ భూకుంభకోణం సర్కారు చేపట్టిన ఆడిట్ ద్వారా తెలిసిందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. అంటే భూకుంభకోణంలో వెలుగులోకి వచ్చిన వారి పేర్ల జాబితా కూడా  సర్కారే వెల్లడించిందన్న విమర్శలు  ఊపందుకున్నాయి. మరి  ఒక వర్గం నాయకుల పేర్లే బయటకు రావడం ఏంటబ్బా అని జనాలు చర్చించుకుంటున్నారు.

రంగారెడ్డి జిల్లాలో భూముల కుంభకోణంలో రోజుకొక అధికార పార్టీ నేత పేరు బయటకొస్తుంది. నిన్న మొన్నటి వరకు ఎంపి కేశవరావు పేరు బయటపడింది. కేశవరావు తొలుత తాట తీస్తానంటూ హూంకరించినా, తర్వాత మెత్తబడి తన కుటుంబం తీసుకున్న భూముల రిజిస్ట్రేషన్లు రద్దు చేసుకుంటానని ప్రకటించారు. అక్రమ భూములను తనకు అంటగట్టిన వారిపైన కేసు వేస్తానని హెచ్చరించారు. తన డబ్బుతోపాటు వడ్డీ కూడా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
కెకె తర్వాత మరో ఎంపి డి.శ్రీనివాస్ పేరు తెర మీదకు వచ్చింది. ఈయన కూడా రంగారెడ్డి జిల్లాలో గోల్డ్ స్టోన్ ప్రసాద్ వద్ద భూములు కొనుగోలు చేశారు. అతి తక్కువ ధరకే భూములు కొన్నట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై డిఎస్ సైతం తన భూములు వెనక్కు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 
వీరిద్దరితోపాటు మరో నేత గతంలోనే చర్చనీయాంశమయ్యారు. శాసనమండలి ఛైర్మన్ గా పనిచేస్తున్న నేతి విద్యాసాగర్. ఆయనకు నయీంతో సంబంధాలున్నాయని లీకులు వచ్చాయి. త్వరలోనే ఆయనను అరెస్టు చేయనున్నట్లు కూడా పాలక పెద్దల నుంచి సంకేతాలు అందాయి. నయీంతో అధికార పార్టీలో డజన్ల కొద్దీ నేతలకు సంబంధాలున్నాయని తర్వాత తేలింది. కానీ ప్రముఖంగా పేరు వినిపించింది మాత్రం నేతి విద్యాసాగర్ దే. ఆయన అరెస్టు ఖాయమని సర్కారు పెద్దలు మీడియాకు పదే పదే లీకులు ఇచ్చారు.
కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో చేరిన ఈ ముగ్గురు నేతలను సర్కారు పెద్దలు టార్గెట్ చేశారన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. వీరంతా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడం కూడా మరింత చర్చకు ఆస్కారం ఏర్పడింది. వీరిలో కెకె, డిఎస్ ఇద్దరూ గతంలో పిసిసి అధ్యక్షులుగా పనిచేసిన వారే. ప్రస్తుతం ఇద్దరూ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. తెలంగాణలో బలమైన సమాజికవర్గాల్లో మున్నూరు కాపు సామాజికవర్గం ఒకటి. మిగతా సామాజికవర్గాలను పక్కన పెట్టి కాంగ్రెస్ నుంచి వచ్చిన మున్నూరు కాపు సామాజిక వర్గం నేతలనే పాలక పెద్దలు టార్గెట్ చేయడం ఎందుకోసం అన్న చర్చ జరుగుతోంది. 
వాస్తవానికి ఇటు భూముల కుంభకోణంలో కానీ, నయీం కేసులో కానీ ఈ ముగ్గురు నేతలు తప్ప ఇంకెవరూ లేరని సర్కారు భావిస్తోందా ? మిగతా వారి పేర్లు ఎందుకు లీక్ చేయడంలేదు? లేకపోతే మిగతావారిపై వివరాలు అందలేదా? అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మరోవైపు సిఎం కెసిఆర్ కుటుంబసభ్యులు కూడా భూముల కుంభకోణంలో భాగస్వాములుగా ఉన్నట్లు విపక్షాల నుంచి విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అందుకే అందరి బాగోతం బయటకు రావాలంటే సిబిఐ విచారణ జరపాలని కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కేవలం ఒకరిద్దరు పేర్లు బయట పెట్టడం ద్వారా ఈ కేసులో పురోగతి ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు.
కెసిఆర్ సన్నిహితులు, ఆయన కుటుంబసభ్యుల పేర్లను విపక్షాలు బయటపెడుతున్న తరుణంలో కేవలం సర్కారు మాత్రం మున్నూరు కాపు నేతలైన ముగ్గురిని టార్గెట్ చేసి మీడియాకు లీకులు ఇవ్వడం చేస్తే వారి పలుకుబడిని తగ్గించేందుకే చేస్తున్నారని అంటున్నారు. ఈ పేర్లు బయటకు రావడంతో సిఎం తన సొంత కుటుంబసభ్యుల మీద, తన సన్నిహితుల మీద నుంచి చర్చను పక్కదారి పట్టించే కుట్రలో భాగమే అని రాజకీయ వర్గాల్లో కాపు నేతలు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణ నిజమా లేక కాపు పెద్దతలకాయలే బయటపడటం యాధృచ్ఛికమా... ఎవరో మున్నూరు కాపునేత నిజాలు కక్కేయాల్సిందే.
మొత్తానికి ఒక సామాజికవర్గం నేతలను అధికార పార్టీ నాయకత్వం టార్గెట్ చేయడం సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఈ పరిణామాలు ఇంకా ఎంతకాలం సాగుతాయా అన్నది చూడాలి.