ఇండియా Vs అస్ట్రేలియా టీ 20 మ్యాచ్: 2500 మందితో ఉప్పల్ స్టేడియం వద్ద బందోబస్తు

ఉప్పల్ స్టేడియం వద్ద 2500 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ, షార్ప్ షూటర్స్, అక్టోపస్ బలగాలను కూడా రంగంలోకి దించారు 300 సీసీ కెమెరాలతో పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

India Vs Australia T20 cricket match: Tight security at Uppal Stadium in Hyderabad

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం వద్ద 2500 మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ. ఆదివారం నాడు ఇండియా, అస్ట్రేలియా మధ్య టీ 20 క్రికెట్ మ్యాచ్ ఉన్న నేపథ్యంలో  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ఇవాళ రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.  ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా హెచ్ సీ ఏ అధ్యక్షుడు మహమ్మద్ అజహరుద్దీన్ రెండు రోజుల క్రితం ప్రకటించారు. ఉప్పల్ స్టేడియంలో కూర్చొన్న ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారో చూసేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ చూసేందుకు వెళ్లేవారికి ఫోన్లు తీసుకెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. మొబైల్స్ మినహా ఇతర ఎలక్ట్రానిక్  పరికరాలను అనుమతించలేమని పోలీసు శాఖ ప్రకటించింది. 

ఉప్పల్ స్టేడియం పరిసరాలను పరిశీలించేందుకు గాను 300 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఉప్పల్ స్టేడియం వద్ద షార్ప్ షూటర్స్ రెండు గ్రూపులను ఏర్పాటు చేశారు. అక్టోపస్ బలగాలు కూడ అందుబాటులో ఉంచారు. ఉప్పల్ స్టేడియానికి వచ్చే మార్గంలోనే మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. 

ఉప్పల్ స్టేడియానికి మ్యాచ్  తిలకించేందుకుగాను వచ్చే వారు తమ వాహనాలను పార్క్ చేసేందుకు గాను పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లోని  21 ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ఉప్పల్, రామాంతాపూర్ మీదుగా వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.

 ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని పోలీసులు సూచించారు.  మరో వైపు బ్లాక్ లో టికెట్లు విక్రయిస్తున్న వారిపై పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. బ్లాక్ టికెట్లు విక్రయిస్తున్న వారిలో కొందరిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇవాళ జరిగే మ్యాచ్ సిరీస్ ను ఎవరు కైవసం చేసుకొంటారో నిర్ణయించనుంది. 

also read:హైదరాబాద్ చేరుకున్న భారత్ - ఆస్ట్రేలియా ఆటగాళ్లు... శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సందడి

ఈ మ్యాచ్ టికెట్ల విక్రయంలో గందరగోళం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం జింఖానా గ్రౌండ్స్ వద్ద టికెట్ల కోసం వచ్చిన అభిమానుల మధ్య తొక్కిసలాట చోటు చేసుకొంది.ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. మ్యాచ్  నిర్వహణకు సంబంధించి తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష నిర్వహించారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios