Asianet News TeluguAsianet News Telugu

జానారెడ్డి నివాసంలో ఐటీ అధికారుల సోదాలు: రెండో రోజూ కాంగ్రెస్ నేతల ఇళ్లలో సాగుతున్న దాడులు


ఎన్నికల సమయంలో  ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి.  రెండు రోజులుగా  తెలంగాణ రాష్ట్రంలో ఆదాయ పన్ను శాఖాధికారులు  సోదాలు నిర్వహిస్తున్నారు.

Income Tax Searches  in Former Minister  Jana Reddy Residence lns
Author
First Published Nov 3, 2023, 9:11 AM IST

హైదరాబాద్: మాజీ మంత్రి జానారెడ్డి నివాసంలో  ఐటీ అధికారులు  శుక్రవారం నాడు ఉదయం నుండి సోదాలు నిర్వహిస్తున్నారు. జానారెడ్డి తనయుడు రఘువీర్  రెడ్డి వ్యాపార లావాదేవీలపై  ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిన్నటి నుండి తెలంగాణ రాష్ట్రంలో  ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.  

విస్పర్ వ్యాలీ విల్లాలోని  రఘువీర్ రెడ్డి  నివాసంలో  ఆదాయ పన్ను శాఖ అధికారులు  సోదాలు నిర్వహించారు.  జానారెడ్డి  మరో తనయుడు  జయవీర్ కు  కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు దక్కింది. నాగార్జునసాగర్ నుండి జయవీర్ బరిలో నిలిచారు.  మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం నుండి రఘువీర్  టిక్కెట్టు కోసం  ధరఖాస్తు చేసుకున్నారు.  కాంగ్రెస్ నేతలకు  చెందిన  18 చోట్ల  ఆదాయ పన్ను శాఖాధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 

నిన్న ఉదయం నుండి  కాంగ్రెస్ నేతలు  కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి,  బడంగ్ పేట  పారిజాత లక్ష్మినరసింహరెడ్డి  నివాసంలో  సోదాలు నిర్వహించారు. 
ఐటీ అధికారులు సోదాలు నిర్వహించేందుకు  వచ్చిన సమయంలో పారిజాత ఇంట్లో లేరు. ఆమె  తిరుపతిలో  ఉన్నారు.  ఆమె భర్త  నరసింహరెడ్డి న్యూఢిల్లీలో ఉన్నారు.  తిరుపతి నుండి చెన్నై మీదుగా  పారిజాతను  ఐటీ అధికారులు  నిన్న రాత్రి  హైద్రాబాద్ కు తీసుకువచ్చారు.

 ఇవాళ తెల్లవారుజామున  ఆరున్నర గంటల వరకు  ఐటీ సోదాలు నిర్వహించారు.  పారిజాత హైద్రాబాద్ కు వచ్చే సమయానికే ఆమె భర్త నరసింహరెడ్డి కూడ  న్యూఢిల్లీ నుండి హైద్రాబాద్ కు చేరుకున్నారు.  పారిజాత నరసింహరెడ్డికి సంబంధించి ఆదాయం, వ్యాపార వ్యవహరాల గురించి ఐటీ అధికారులు  ప్రశ్నించారు. ఐటీ అధికారుల  ప్రశ్నలకు  సమాధానం ఇచ్చినట్టుగా  పారిజాత నరసింహరెడ్డి  మీడియాకు  చెప్పారు.

తాను  ఎన్నికల బరిలో నిలిస్తే  ప్రత్యర్ధులకు  నష్టమనే భయంతో  ఐటీ దాడులు చేయించారని  పారిజాత నరసింహరెడ్డి విమర్శించారు.  మరో వైపు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి  నివాసంలో కూడ  ఇవాళ  తెల్లవారు జాము వరకు  ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. పారిజాత నరసింహరెడ్డి, కెఎల్ఆర్ నివాసాల్లో  కీలక పత్రాలు, నగదును  ఐటీ అధికారులు సీజ్ చేశారని  సమాచారం.  ఈ విషయమై ఐటీ అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

also read:హైద్రాబాద్ లో ఐటీ సోదాలు: కోమటిరెడ్డి బంధువు ఇంట్లో తనిఖీలు

ఐటీ సోదాలపై కాంగ్రెస్ నేతలు  సీరియస్ గా స్పందించారు. బీఆర్ఎస్ కు  సహకరించే ఉద్దేశ్యంతోనే  బీజేపీ  ఐటీ సోదాలను చేపట్టిందని  కాంగ్రెస్ నేత  మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.  ఐటీ సోదాలకు భయపడేది లేదని  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  కూడ  చెప్పారు.  ఇదిలా ఉంటే  ఐటీ సోదాలకు తమకు ఎలాంటి సంబంధం లేదని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  స్పష్టం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios