కాంగ్రెస్ లో చేరబోమంటున్న తెలుగు తమ్ముళ్లు ఇంతకాలం రేవంత్ కు దన్నుగా ఉన్న ఐటి విభాగం టిడిపితోనే ఉంటామంటున్న ఐటి విభాగం ప్రతినిధులు

తెలంగాణ టిడిపిలో రేవంత్ రెడ్డి పార్టీని వీడడం తెలుగుదేశం పార్టీకి మరో పెద్ద సంక్షోభంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి. మొన్నటి వరకు రేవంత్ రెడ్డితో పార్టీలోని కీలకమైన నాయకులంతా టిడిపి నుంచి వెళ్లిపోతున్నారన్న వాతావరణం నెలకొంది. అయితే తాజా పరిస్థితులను బేరీజు వేసుకుంటే రేవంత్ తో టిడిపి నాయకత్వం భయంకరమైన వైరం నడుపుతలేదు. అలాగే రేవంత్ వైపు నుంచి కూడా వైరం కోరుకోవడంలేదు. తనకు చంద్రబాబు తండ్రితో సమానమని కూడా ప్రకటనలు ఇచ్చాడు రేవంత్ రెడ్డి.

ఇక ఈ సందిగ్థత నెలకొన్న తరుణంలో పార్టీ శ్రేణులు అయోమయం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. రేవంత్ రెడ్డితో వెళ్లేవారెవరో తేలిపోవడంతో మిగతవారంతా పార్టీకోసం పనిచేయాలన్న తలంపుతో ఉన్నారు. గురువారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పార్టీ అధినేత చంద్రబాబుతో జరిగిన సమావేశం తమకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని చెబుతున్నారు కార్యకర్తలు. సంక్షోభాన్ని అవకాశంగా భావించి పనిచేయాలని చంద్రబాబు తమకు ఆదేశించారని ఆ దిశగా తాము పనిచేస్తామంటున్నారు తెలంగాణ తెలుగు తమ్ముళ్లు. పార్టీ అధినేతతో సమావేశం జరిగిన తర్వాత నూతన ఉత్సాహంతో తాము పనిచేస్తామని, ఇప్పుడు సంక్షోభం ఛాయలు ఏమాత్రం పార్టీలో కనిపించడంలేదని చెప్పారు తెలంగాణ టిడిపి అధికార ప్రతినిధి ఉప్పలపాటి అనూష రామ్. నవంబరు 2వ తేదీన జరిగిన సమావేశం పండుగ వాతావరణంలో జరిగిందన్నారు. ఇక నుంచి ఐటి విభాగం మరింత ఉత్సాహంతో పనిచేస్తుందని వెల్లడించారామె.

గతంలో రేవంత్ రెడ్డికి దన్నుగా పనిచేసిన చాలా విభాగాలు నేడు రేవంత్ తో వెళ్లేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఇప్పుడైతే టిడిపితోనే మా ప్రయాణం అంటూ ఇక్కడే సెటిల్ అయిపోతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి కి టిడిపి ఐటి విభాగం గట్టి మద్దతు ఇచ్చిన పరిస్థితి ఉండేది. ఐటి విభాగం వారు క్షణాల్లో రేవంత్ వార్తలను సమాజానికి చేరవేసేవారు. తద్వారా రేవంత్ కు సమాజంలో వచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. రేవంత్ రెడ్డి సంపాదించిన పాపులారిటీలో ఐటి విభాగం సేవల పాత్ర కూడా తీసిపోని విధంగా ఉందంటున్నారు ఐటి విభాగం ప్రతినిధులు. రేవంత్ సైన్యం అని, రేవంత్ మిత్ర మండలి అని ఇలా రకరకాల పేర్లతో సోషల్ మీడియాలో నెటిజన్ల రూపంలో టిడిపి తమ్ముళ్లు రేవంత్ కోసం పనిచేశారు. ఇప్పుడు మాత్రం ఐటి విభాగం నుంచి ఎవరూ వెళ్లడంలేదని, టిడిపి కోసమే పనిచేస్తామని వారు చెబుతున్నారు.

అందుకే రేవంత్ పేర్లతో ఉన్న తమ సంస్థల పేర్లను మార్చుకుంటున్నారు ఐటి విభాగం వారు. పసుపు దళం అని మార్చేశారు. తెలంగాణ పసుపు సైన్యం అని, తెలంగాణ పసపు దళం అని ఇలాంటి పేర్లతో తమ సరికొత్త కార్యాచరణ షురూ చేశారు తెలంగాణ తెలుగుదేశం పార్టీలోని ఐటి తమ్ముళ్లు. ఇక రేవంత్ రెడ్డి పార్టీ మారినంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదని తమ శక్తిమేరకు పనిచేస్తామని అంటున్నారు మిగతా వర్గాల కార్యకర్తలు. గత 35 ఏళ్ల కాలంలో ఇలాంటి సంక్షోభాలెన్నింటినో తెలుగుదేశం పార్టీ ఎదుర్కని నిలబడిందని గుర్తు చేస్తున్నారు. తమకు కాంగ్రెస్, టిఆర్ఎస్ రెండూ సమానమైన ప్రత్యర్థి పార్టీలే తప్ప తమకు ఏ పార్టీతో అంటకాగాల్సిన అవసరం లేదని నల్లగొండకు చెందిన టిడిపి నేత మాతంగి శ్రీనివాస్ ఏషియా నెట్ కు వెల్లడించారు. రేవంత్ రెడ్డి పోయినంత మాత్రాన తెలుగుదేశం పార్టీని మూసివేస్తామా అని ప్రశ్నించారు. తమ శక్తిమేరకు పార్టీ కోసమే పనిచేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక యూనివర్శిటీ లాంటిదని, అలాంటి యూనివర్శిటీలోకి విద్యార్థులు వస్తారు.. పోతారు తప్ప యూనివర్శిటీ మాత్రం అలాగే ఉంటదని ఆయన వివరించారు.

మొత్తానికి తెలంగాణ టిడిపిలో రేవంత్ ఎపిసోడ్ ఒక కుదుపు కుదిపిన పరిస్థితులు ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు తెలంగాణ తెలుగు తమ్ముళ్ళు.

చంద్రబాబుకు గుడి కట్టిస్తామంటున్న హిజ్రాలు

ఈ వార్తతోపాటు మరిన్ని తాజా వార్తలకోసం కింద క్లిక్ చేయండి

https://goo.gl/NY4JPG