హైదరాబాద్‌లోని చందానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. మహిళా న్యాయవాది శివాని ఆత్మహత్య చేసుకున్నారు. భవనంపై నుంచి దూకి బలవన్మరనానికి పాల్పడ్డారు. 

హైదరాబాద్‌లోని చందానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. మహిళా న్యాయవాది శివాని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు.. శివానికి ఐదేళ్ల క్రితం అర్జున్‌తో వివాహం జరిగింది. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. వీరు లక్ష్మీ విహార్‌ ఫేజ్‌ వన్‌ ఢిఫెన్స్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే కొంతకాలంగా భార్యభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మనస్తాపం చెందిన శివాని.. శనివారం రాత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాల కారణంగా శివాని ఆత్మహత్య చేసుకుని ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక, ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. 

మరోవైపు ఈ ఘటనకు సంబంధించి శివాని భర్త అర్జున్ చందానగర్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. శివాని మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ నిమిత్తం తరలించారు. ఇక, శివాని మృతికి భర్త అర్జున్‌ కారమణమని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.