శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని దేశీయ, అంతర్జాతీయ టెర్మినల్స్ నుంచి ప్రయాణీకులు సంఖ్య పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత నెలలో రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్ నుంచి 3,68,693 మంది దేశీయ, 16,40,603 మంది అంతర్జాతీయ ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చింది.

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతి యేటా తన అత్యుత్తమ సేవలు, ప్రయాణీకులు, ఇతర అంశాల్లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణీకుల రద్దీ పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వెబ్‌సైట్‌లో అందుబాటులో వున్న గణాంకాల ప్రకారం.. కేవలం ఒక్క ఏడాదిలోనే ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణీకుల సంఖ్య పెరిగింది. గత నెలలో రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్ నుంచి 3,68,693 మంది దేశీయ, 16,40,603 మంది అంతర్జాతీయ ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చింది. ఇది గతేడాదితో పోలిస్తే గణనీయమైన పెరుగుదల. అప్పట్లో దేశీయంగా 2,89,286 మందిని అంతర్జాతీయంగా 13,11,995 మంది అంతర్జాతీయ ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చించి. 

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు విద్యార్ధులు క్యూ కట్టడంతో హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రద్దీ పెరిగినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. విద్యార్ధులకు సెండాఫ్ ఇచ్చేందుకు వస్తున్న వారి సంఖ్య పెరగడంతో వారిపై పోలీసులు ఆంక్షలు విధించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణీకుల సంఖ్య పెరగడంతో నగరంలో మరో విమానాశ్రయాన్ని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. హకీంపేట్‌లోని విమానాశ్రయంలో కమర్షియల్ విమానాలు నడిచేందుకు అనుమతించాలని కేంద్ర రక్షణ శాఖను కోరింది.

Also Read: రోజుకు లక్ష మంది , 70 వేల కార్లు.. సెండాఫ్ ఇచ్చే వారితో కిక్కిరిసిపోతోన్న శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌

కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తే రెండు విమానాశ్రయాలు వున్న నగరాల జాబితాలోకి హైదరాబాద్ చేరనుంది. బెల్జియంలోని బ్రస్సెల్స్, పోలండ్‌లోని వార్సా, కెనడాలోని మోంట్రియల్, చైనాలోని బిజింగ్, టర్కీలోని ఇస్తాంబుల్, యూకేలోని గ్లాస్కో నగరాల్లో ఇప్పటికే రెండు విమానాశ్రయాలు ప్రజలకు సేవలందిస్తున్నాయి.