హైద్రాబాద్ లో శ్రీరామనవమి శోభాయాత్రలో గాడ్సే ఫోటో : కేసు నమోదు
శ్రీరామ శోభాయాత్రలో గాడ్సే ఫోటో ప్దదర్శించిన హేమకుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. హేకుమార్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
హైదరాబాద్: శ్రీరామనవమిని పురస్కరించుకొని నిర్వహించిన శోభాయాత్రలో గాడ్సే ఫోటో ప్రదర్శించడంపై కేసు నమోదు చేశారు. ఈ ఏడాది మార్చి 30వ తేదీన శ్రీరామనవమిని పురస్కరించుకొని శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్రలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. ఈ ర్యాలీలో పాల్గొన్నవారిలో కొందరు నాథూరామ్ గాడ్సే ఫోటోను ప్రదర్శించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గాడ్సే ఫోటోను ప్రదర్శించిన హేమకుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
శ్రీరామ శోభాయాత్ర సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో గాడ్సే ఫోటో ప్రదర్శన విషయమై సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ విషయమై విమర్శలు కూడా వచ్చాయి.
హేమ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమలాపురం ప్రాంతాని చెందినవాడుగా పోలీసులు గుర్తించారు. శోభాయాత్రలో హేమకుమార్ పాల్గొన్నారు. అయితే ఈ ర్యాలీలో పాల్గొన్న గుర్తు తెలియని వ్యక్తుల నుండి గాడ్సే ఫోటోను తీసుకొని ప్రదర్శించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ విషయమై హేమకుమార్ ను ప్రశ్నించనున్నారు.
ఈ శోభాయాత్ర సందర్భంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆయనపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అఫ్జల్ గంజ్ పోలీసులు రాజాసింగ్ పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
also read:జైలుకు పంపే కుట్ర: కేసులపై రాజాసింగ్
పోలీసు కేసుల విషయంలో గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ధర్మం కోసం తాను పనిచేస్తున్నానని ఆయన చెప్పారు. ఈ విషయంలో అవసరమైతే జైలుకు కూడా వెళ్తానని కూడా రాజాసింగ్ చెప్పారు.