ఎన్ని కేసులు పెట్టినా తాను ధర్మం  కోసం పోరాటం  చేస్తూనే ఉంటానని  గోషామహల్   ఎమ్మెల్యే  రాజాసింగ్  చెప్పారు. శ్రీరామనవమి  సందర్భంగా  తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు  చేయలేదని  ఆయన  స్పష్టం  చేశారు. 

హైదరాబాద్: ధర్మం కోసం పోరాటం చేస్తుంటే తనపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు. రెండు రోజులుగా తనపై హైద్రాబాద్ నగరంలోని అఫ్జల్ గంజ్, షాహియానత్ గంజ్ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల విషయమై రాజాసింగ్ స్పందించారు. తనపై కేసుల మీద కేసులు పెడుతున్నారన్నారు. ఈ కేసులకు తాను భయపడబోనని చెప్పారు. తనను జైలుకు పంపేందుకు కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయన్నారు. ఈ విషయమై ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు పట్టించుకోలేదని రాజాసింగ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

also read:రాజాసింగ్ పై కేసు: హైద్రాబాద్ షాహినాయత్‌గంజ్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్

శ్రీరామనవమిని పురస్కరించుకొని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఈ నెల 1వ తేదీన అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు రాసా సింగ్ పైకేసు నమోదు చేశారు.ఈ కేసు నమోదు చేసిన మరునాడే షాహినాయత్‌గంజ్ పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైంది.

ఈ ఏడాది మార్చి 30న ముంబైలో రాజాసింగ్ పై కేసు నమోదు చేశారు. ఈ ఏడాది జనవరి 29న ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్ పై కేసు నమోదైంది. ముంబైలో జరిగిన సమావేశంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్ పై హైద్రాబాద్ మంగల్ హట్ పోలీసులు రాజాసింగ్ కు నోటీసులు కూడా ఇచ్చిన విషయం తెలిసిందే