టీఎస్‌పీఎస్‌సీలో మరో ప్రశ్నాపత్రం లీక్: 9 మంది అరెస్ట్
టీఎస్‌పీఎస్సీలో ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో 9 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.ఈ కేసులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీలో 9 మందిని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. బేగంబజారు పోలీసులు సోమవారంనాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ పేపర్ లీకేజీకి సంబంధించి వివరాలను వెల్లడించారుటీఎస్‌పీఎస్‌సీలో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ , టీఎస్‌పీఎస్ సీ ఉద్యోగి ప్రవీణ్ లు ఈ వ్యవహరంలో కీలకంగా వ్యవహరించినట్టుగా పోలీసులు చెప్పారు.
టీఎస్‌పీఎస్ సీ ఉద్యోగి ప్రవీణ్ తో ప్రభుత్వ టీచర్ రేణుక పేపర్ లీకేజీకి ప్రధాన సూత్రధారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. రేణుక, ఆమె భర్త, సోదరుడిని కూడా అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు.
ప్రవీణ్, రాజశేఖర్ లు పేపర్ ను లీక్ చేశారని పోలీసులు తెలిపారు. కంప్యూటర్ లోని ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసిన తర్వాత రేణుకకు ప్రవీణ్ ఈ ప్రశ్నాపత్రాన్ని షేర్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. మరికొందరికి కూడా ఈ ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి. ఈ మేరకు రూ. 14 లక్షలను నిందితులు అభ్యర్ధుల నుండి వసూలు చేశారని పోలీసులు తెలిపారు.
also read:టీఎస్‌పీఎస్‌సీలో ప్రశ్నాపత్రం లీక్: రూ. 14 లక్షలు వసూళ్లు
టౌన్ ప్లానింగ్ ఓవర్సీస్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకైందన్నారు.ఈ నెల 15, 16 తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల పరీక్షకు సంబంధించి ప్రశ్నాపత్రం లీకైందా లేదా నిర్ధారణ కావాల్సి ఉందని పోలీసులు చెప్పారు. ఈ నెల 5 తేదీన జరిగిన అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షా ప్రశ్నాపత్రం లీకైందని పోలీసులు గుర్తించారు.